అసౌకర్యాల వెంబడి!

ABN , First Publish Date - 2022-07-04T05:18:12+05:30 IST

జిల్లాలో సర్కారీ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటాలానే ఈ సారి కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

అసౌకర్యాల వెంబడి!
భామిని మండలం బూరుజోలలో శిఽథిలమైన రేకుల షెడ్‌లో ఉన్న పాఠశాల

  సకాలంలో పూర్తికాని నాడు-నేడు పనులు

  శిథిల భవనాల్లోనే కొన్ని ప్రభుత్వ పాఠశాలలు

  వేధిస్తున్న మౌలిక వసతుల కొరత

  అరకొరగానే చేరిన పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు

   కొత్త విద్యా సంవత్సరంలోనూ తప్పని ఇబ్బందులు

   5న పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ప్రత్యేక కథనం

 ( పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సర్కారీ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటాలానే ఈ సారి కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. నాడు-నేడు మొదట దశలో పనులు పూర్తయినా, రెండో దశలో మంజూరైన పనులు ఇంకా పూర్తికాలేదు. మరోవైపు ఇప్పటికీ అనేక మండలాల్లో పాఠశాలలు శిథిల భవనాల్లో కొనసాగుతున్నాయి. తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత అలానే ఉంది. ఇంకొన్ని స్కూళ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేదు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పూర్తిస్థాయిలో ఇంకా జిల్లాకు రాలేదు.  విద్యాభివృద్ధికి కోట్లాది రుపాయలు వెచ్చిస్తున్నామని  ప్రభుత్వం చెబుతున్న మాటలకు..  క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు పొంతన ఉండడం లేదు.  మొత్తంగా పాత సమస్యల మధ్యే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి సర్కారీ పాఠశాలలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 

ఇదీ పరిస్థితి.. 

జిల్లాలో 1,722  ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,333 ప్రైమరీ, 158 అప్పర్‌ ప్రైమరీ, 231  జడ్పీ స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 486 బడుల్లో  మొదట దశ  నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టారు. రెండో దశలో 337 పాఠశాలల్లో నాడు-నేడు పనులు మంజూరయ్యాయి. అయితే రెండో దశ పనులు పూర్తికాకపోవడంతో సమస్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వాటిల్లో కొన్ని ఇలా.. 

  ఉదాహరణకు పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలోని జడ్పీ పాఠశాలలో వసతి సమస్య తీవ్రంగా ఉంది.  నాడు-నేడు కింద 12 తరగతి గదులు మంజూరైనా సకాలంలో పనులు పూర్తికాలేదు. దీంతో  తరగతులను చెట్లు కింద నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది.

  సీతానగరం మండలం ఆర్‌.వెంకంపేట గ్రామంలోనూ ప్రాతమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాడు-నేడు కింద పాఠశాలకు భవనాలు మంజూరు జరిగినా పనులు పూర్తికాలేదు. గతేడాదిలానే ఈ సారి కూడా చెట్లు కింద తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

  కొమరాడ మండలంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తికాలేదు.  మొదట దశ నాడు-నేడు పనులకు సంబంధించి అవినీతి బయటపడడంతో విచారణకు చేపట్టారు. దీంతో సుమారు రూ. 15 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు.    

  భామిని మండలం బూరుజోల పాఠశాలను రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. రేకులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షం వస్తే ఇబ్బందులు తప్పడం లేదు.   కొమరాడ మండలం వన్నాం ఎంపీపీ పాఠశాల కూడా శిథిలావస్థకు చేరింది.  స్లాబ్‌ పెచ్చులు ఊడిపోతున్నాయి. దీనిపై గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. 

పూర్తిస్థాయిలో రాని పాఠ్య పుస్తకాలు

 జిల్లాకు కావలసిన పాఠ్య పుస్తకాలు ఇంకా 50 శాతం  కూడా రాలేదు.  మొత్తంగా 10,81,700 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, కేవలం 3,99,541 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. మిగిలిన పుస్తకాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు విద్యార్థులకు పంపిణీ చేస్తారో అఽధికారులే చెప్పాల్సి ఉంది. 

129 పాఠశాలలు విలీనం

 జిల్లాలో కిలో మీటరు దూరంలో ఉన్న 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ మొదటి దశను పూర్తి చేశారు.  మొత్తంగా 129 ప్రాథమిక స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఆయా స్కూళ్లకు చెందిన  విద్యార్థులను గ్రామానికి దూరంగా ఉండే పాఠశాలలను పంపించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. కిలోమీటరు దూరంలో ఉన్న స్కూళ్లకు ఎలా నడిచి వెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా వాహనాల రాకపోకలతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.  దీంతో ఆయా విద్యార్థుల్లో చాలామంది డ్రాపౌట్లుగా మారే అవకాశం ఉంది. 

 యూనిఫారాల తరలింపు

 జిల్లాకు 1,03,883 యూనిఫారాలు కావాలని అధికారులు ఇండెంట్‌ పెట్టారు. అయితే ఇప్పటివరకూ 1,00,441 యూనిఫారాలే వచ్చాయి. ఇవి కూడా పూర్తిస్థాయిలో రాలేదు.  50 శాతం కన్నా తక్కువ వచ్చిన జిల్లాలకు ఇక్కడి నుంచి యూనిఫారాలు పంపిస్తూ సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా  పాఠశాలల పునఃప్రారంభం నాటికి  విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫారాలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. 

  సమస్యలు పరిష్కరించాం

నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో  సమస్యలను పరిష్కరించాం.  ఎక్కడైనా తరగతి గదులు, ఇతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. పూర్తిస్థాయిలో యూనిఫారాలు అందిస్తాం. కొన్ని పాఠశాలలకు సంబంధించి ఎడ్జస్ట్‌మెంట్‌ చేపడుతున్నప్పటికీ అందరికీ ఈ నెలలోనే అందిస్తాం. పాఠ్య పుస్తకాలనూ పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం.

- బ్రహ్మాజీరావు, ఇన్‌చార్జి డీఈవో, పార్వతీపురం 


 

Updated Date - 2022-07-04T05:18:12+05:30 IST