జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు

ABN , First Publish Date - 2022-04-10T05:59:08+05:30 IST

జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. వేళాపాళా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలి పేస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలతో పాటు చిరువ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు
కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలను పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు

 ఎండ వేడి, ఉక్కపోతతో జనం ఇక్కట్లు

(పార్వతీపురం)

జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. వేళాపాళా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలి పేస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలతో పాటు చిరువ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది జీవనోపాధిని కోల్పోతున్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో గృహోపకరణాల వినియోగం పెరిగింది. ఉత్పత్తి కంటే వాడకం ఎక్కువగా ఉండడంతో ఈఎల్‌ఆర్‌ పేరిట జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు విధించడం సాధారణమైంది.  సరాసరి రోజుకు ఎనిమిది గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండడంతో ఆ ప్రభావం ఉపాధిపై పడుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలు, చిన్న తరహా పరిశ్రమలు, రైస్‌మిల్లులు, చిరు వ్యాపారాలు, ఇతర దుకాణాల నిర్వహణ కష్టతరమవుతోంది.  జెరాక్స్‌ మిషన్లు, జ్యూస్‌ సెంటర్లు, ఐస్‌ తయారీ, వాటర్‌ సర్వీసింగ్‌ కేంద్రాలు బోసిపోతున్నాయి. విద్యుత్‌ సక్రమంగా లేక పోవడంతో దుకాణాలు నడపలేని దుస్థితి నెలకొందని, తద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరీక్షల వేళ విద్యార్థులు, సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. పబ్లిక్‌ పరీక్షల గడువు సమీపిస్తుండడంతో రాత్రివేళ కోతల కారణంగా కొవ్వొత్తులు, లాంతర్లు పెట్టుకుని చదువుతున్నారు.   ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సక్రమంగా విద్యుత్‌ సరఫరా అమలు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

  బాదుడు తగదు 

  రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు అమాంతం పెంచి.. ప్రజలపై భారం మోపడం తగదని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. విద్యుత్‌ కోతలు.. బిల్లుల మోతకు నిరసనగా   తాళ్లబురిడి గ్రామంలో ఇంటింటికి అగ్గి పెట్టె, కొవ్వొత్తులు పంపిణీ  చేశారు.  అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ..   అన్నింటా పన్నులు విధిస్తూ, చార్జీలు పెంచేస్తూ..  ప్రజలకు ఇబ్బందులకు ప్రజలను గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.   కార్యక్రమంలో  టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బోను దేవీచంద్రమౌళి, జాగాన రవిశంకర్‌, మూడడ్ల అప్పలనాయుడు, బేత లక్ష్మణరావు, యాండ్రాపు చినరామ్మూర్తినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

 కుటుంబ పోషణ భారం

 విద్యుత్‌ కోతల వల్ల మా బతుకులు రోడ్డున పడ్డాయి. కుటుంబ పోషణ భారంగా మారింది.   వ్యాపార సమయంలో విద్యుత్‌ కోతలు లేకుండా ఉంటేనే మాకు ఉపాధి లభిస్తుంది.

- కనకల ప్రసాద్‌, జ్యూస్‌ సెంటర్‌ నిర్వాహకుడు, పార్వతీపురం

 

నష్టపోతున్నాం.. 

విద్యుత్‌ కోతల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. అప్రకటిత కోతలతో వ్యాపారం జరగడం లేదు. కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. దీనిపై అధికారులు స్పందించాలి. 

- గంట శ్రీను, టింబర్‌ డిపో నిర్వాహకుడు, పార్వతీపురం

 

గృహాలకు విద్యుత్‌ కోతలు ఉండవు

 ఇకపై గృహాలకు  విద్యుత్‌ కోతలు ఉండవు. పరిశ్రమలకు సంబంధించి మాత్రమే పవర్‌ హాలిడేలు ఉంటాయి. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే  గంటో, అర గంటో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఉంటుంది.  గృహ వినియోగదారులకు  24 గంటలూ విద్యుత్‌ సరఫరా ఉంటుంది.

- రామకృష్ణ, డీఈఈ, ఏపీ ట్రాన్స్‌కో, పార్వతీపురం



  

Updated Date - 2022-04-10T05:59:08+05:30 IST