‘మన్యం’లో సారా జోరు!

ABN , First Publish Date - 2022-06-12T06:07:20+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో సారా ఏరులై పారుతోంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో అక్రమంగా సారా తయారీ, రవాణా యథేచ్ఛగా సాగుతోంది

‘మన్యం’లో సారా జోరు!
దాడుల్లో స్వాధీనం చేసుకున్న సారా సామగ్రితో ఎస్‌ఈబీ అధికారులు (ఫైల్‌)

  జిల్లాలో యథేచ్ఛగా తయారీ 

 అక్రమంగా సాగుతున్న రవాణా

  ఎస్‌ఈబీలో సిబ్బంది కొరత  

 ఒడిశా నుంచి దిగుమతి 

  దాడులు చేస్తున్నా.. ఆగని విక్రయాలు

   పేదలపై పెను ప్రభావం  

 రోడ్డున పడుతున్న కుటుంబాలు

  కట్టడి చేయాలని జిల్లావాసుల విన్నపం

  

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)


పార్వతీపురం మన్యం జిల్లాలో సారా ఏరులై పారుతోంది.   పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో అక్రమంగా సారా తయారీ, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  రహస్యంగా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా మద్యం ధరలను పెంచింది. దీంతో పేదలు సారా వైపు ఆకర్షితులై.. తమ జేబును, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. మొత్తంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.  

 జిల్లా పరిధిలోని పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ, గురుగుబిల్లి, సీతంపేట, సాలూరు, మక్కువ, పాచిపెంట తదితర చోట్ల సారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని ఒడిశా సరిహద్దుల నుంచి యథేచ్ఛగా  సారా దిగుమతి అవుతోంది. ఏపీ అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడంతో   ప్రధానంగా ఒడిశాకు చెందిన నాగలిబెడ్డ, సేకరం, చిన్నవల్లాడ, పెద్దవల్లాడ, ఎదిగగుమ్మివలస, సందుబడి, కస్పవలస, అలమండ నుంచి ఆంధ్రాకు సారా వస్తోంది. నెంబరు ప్లేట్లను ఇష్టారాజ్యంగా అమర్చుతూ బైక్‌పైనే సారా తీసుకొస్తూ విక్రయిస్తున్నారు.  పది లీటర్ల సారాను విక్రయిస్తే కనీసం రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు లాభం వచ్చే విధంగా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు అలవాటు పడిన వారు  కేసులంటే లెక్క చేయడం లేదు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అక్రమంగా రవాణా సాగిస్తూ.. అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.  అధికారుల దాడుల్లో దొరికిన వ్యక్తులకు బెయిల్‌ కోసం కొంతమంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. దీంతో ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో నిత్యం దాడులు చేస్తున్నా.. ప్రయోజనం ఉండడం లేదు.  

జిల్లాలో కేసులిలా.. 

 కొత్తగా జిల్లా ఏర్పడిన తరువాత ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో 13,240 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.  1,17,350 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.  వాటికి సంబంధించి 162 మంది అరెస్టు చేయగా, 31 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

 ఎస్‌ఈబీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇదే సారా తయారీదారులకు కలిసోస్తుంది.  వాస్తవంగా పార్వతీపుర ంలో  సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. కానీ ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ఒక హెచ్‌సీ, ఆరుగు కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. ఆరుగురు కానిస్టేబుళ్లలో ఇద్దరు మెడికల్‌ లీవ్‌లో ఉండగా, నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. వారిలో ఇద్దరు సెంట్రీలుగా స్టేషన్‌ వద్దే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్ల సహకారంతోనే దాడులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఒక్కోసారి సెంట్రీలుగా ఉన్న వారిని కూడా దాడులకు తీసుకెళ్తున్నారు.  కురుపాం స్టేషన్‌కు సంబంధించి సీఐ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన సీఐ డిప్యూటేషన్‌పై ఎస్‌టీఎఫ్‌కు వెళ్లిపోయారు.   ఎస్‌ఐ,  హెచ్‌సీ, నలుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. నలుగురు కానిస్టేబుళ్లలో ఇద్దరు స్థానికంగా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా, మరొక కానిస్టేబుల్‌ కోర్టులకు నిందితులను తీసుకెళ్లాల్సి ఉంది. అంటే ఒక కానిస్టేబుల్‌ సాయంతో  దాడులు చేస్తున్నారు.   జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో  సచివాలయ కానిస్టేబుళ్లు కూడా దృష్టి కేంద్రీకరిస్తే కొంతవరకైనా సారా విక్రయాలు తగ్గుతాయని స్థానికులు భావిస్తున్నారు. 


  ఉక్కుపాదం మోపుతున్నాం

  ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు సారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. పూర్తిస్థాయిలో నివారణకు ప్రజలు కూడా  సహకరించాలి. సారా విక్రయించిన వారి సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తున్నాం.   తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తూ సంబంధిత వ్యక్తులను అరెస్ట్‌ చేస్తున్నాం. 

- ఆర్‌.సుధాకర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌


Read more