బరితెగింపు!

ABN , First Publish Date - 2022-08-02T05:13:33+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో సారా విక్రయదారులు బరితెగిస్తున్నారు. తమ దందాకు అడ్డొచ్చిన వారిపై తిరగబడుతున్నారు.

బరితెగింపు!
మాట్లాడుతున్న ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

  రెచ్చిపోతున్న సారా విక్రయదారులు 

   గతంలో ఎక్సైజ్‌ కార్యాలయంలోనే కానిస్టేబుల్‌పై దాడి

  తాజాగా బత్తిలి ఎస్‌ఐపై తిరుగుబాటు

  ఉలిక్కిపడిన జిల్లావాసులు

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

పార్వతీపురం మన్యం జిల్లాలో సారా విక్రయదారులు బరితెగిస్తున్నారు. తమ దందాకు అడ్డొచ్చిన వారిపై తిరగబడుతున్నారు. చివరకు పోలీసులను సైతం వదలడం లేదు. సుమారు ఏడాది కిందట పార్వతీపురంలోని ఎక్సైజ్‌ అధికారి కార్యాలయంలోనే ఓ సారా వ్యాపారి కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. తాజాగా భామిని మండలం కొత్తగూడ గ్రామంలో బత్తిలి ఎస్‌ఐపై జరిగిన దాడి అటు జిల్లా పోలీస్‌ యంత్రాంగం, ఇటు మన్యం వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఇకపై ఇటువంటి ఘటనలు సంభవించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. 

 ఇదీ పరిస్థితి.. 

వాస్తవంగా పార్వతీపురం మన్యం జిల్లా సారా విక్రయాలకు కేరాఫ్‌గా చెప్పొచ్చు. జిల్లాగా ఏర్పాటు కాక ముందు నుంచీ ఈ పరిస్థితి ఉంది. జిల్లాలోని కొమరాడ, భామిని, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట, తదితర ఏజెన్సీ మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు పాలకొండలో సారా విక్రయాలు రహస్యంగా సాగుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నుంచి నుంచి జిల్లాలోని ఏజెన్సీ మండలాలు, మైదాన ప్రాంతాలకు దర్జాగా దిగుమతి చేసుకుంటూ సారా విక్రయాలు జరుపుతున్నారు. సెబ్‌ అధికారులు వరుసగా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఎప్పటికప్పుడు బెల్లం ఊటలను ధ్వంసం చేస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. సారా తయారీదారులు, విక్రయదారులు తమ పనిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో జోరుగా సారా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించేవారిపై తిరగబడి దౌర్జన్యం చేస్తుండడంతో అనేకమంది మౌనం వహిస్తున్నారు.   అసలు గ్రామాల్లోకి సారాను ఎలా తీసుకొస్తున్నారు, ఎలా విక్రయాలు చేస్తున్నారు? అన్నది స్థానికులకు తెలిసిన ప్పటికీ దాడులకు జడిసి తమకెందుకులే అంటూ మిన్నకుంటున్నారు.  మొత్తంగా గ్రామాల్లో సారా ఏరులై పారుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సారా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

 కేసుల నమోదు ఇలా.. 

కొత్తగా జిల్లా ఏర్పడిన తరువాత 653 కేసులను నమోదు చేసి 687 మందిని అరెస్టు చేశారు. 107 వాహనాలను సీజ్‌ చేశారు. 29,311 లీటర్ల  బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 780 కిలోల బ్లాక్‌ జాగడ్‌ను సీజ్‌ చేశారు.  జాయింట్‌ ఆపరేషన్‌లో 80 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వెయ్యి లీటర్ల ఐడీని సీజ్‌ చేశారు.

    ఎస్‌ఐపై దాడి కేసులో 12 మంది అరెస్టు

సీతంపేట: భామిని మండలం కొత్తగూడ గ్రామంలో బత్తిలి ఎస్‌ఐ సీతారాములు, సిబ్బందిపై దాడి చేసిన 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. సోమవారం సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటుసారా అమ్ముతున్నారనే ముందస్తు సమాచారంతో ఆదివారం కొత్తగూడకి వెళ్లిన ఎస్‌ఐపై దాడికి పాల్పడిన వారిపై   హత్యాయత్నం, విఽధి నిర్వహణకు భంగం కేసులు నమోదు చేశామన్నారు.  కార్డెన్‌ సెర్చ్‌ చేస్తున్న ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డుపై దాడికి పాల్పడిన ఇద్దరు మహిళలు, పది మంది పురుషులను   అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. సారా తయారు చేసినా, అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సారాతో మూడుసార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక మందికి బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు. నాటుసారా విక్రయదారులు సమన్వయం పాటించాలని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేయడం తగదని తెలిపారు.  తమ శాఖ ద్వారా ఆపరేషన్‌ పరివర్తన్‌, ఆపరేషన్‌ ప్రేరణ కార్యక్రమాలు చేపట్టి అగాహన కల్పిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో  సీఐ శంకరరావు, వీరఘట్టం, పాలకొండ, సీతంపేట ఎస్‌ఐలు హరికృష్ణ, శివ ప్రసాద్‌, ప్రభావతి ఉన్నారు. 

సారాపై ఉక్కుపాదం :ఎస్పీ  

  పార్వతీపురంటౌన్‌ : చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని శ్రీవారి సన్నిధి కల్యాణ మండపంలో సారా పూర్వ వ్యాపారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సారా అమ్మకాలు చేపట్టే వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీసులపై తిరగబడినే కఠిన చర్యలు తప్పవన్నారు. సారా తయారీ, రవాణా చేస్తూ పట్టుపడితే జిల్లా బహిష్కరణ వేటు తప్పదని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ పరివర్తన -2 పేరుతో సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సారా అమ్మకాలు మానుకొని ఇతర  ఉపాధి అవకాశాలు చూసుకోవాలని సూచించారు.  జిల్లా అదనపు ఎస్పీ దిలీప్‌ కిరణ్‌, డిఎస్పీ సుభాష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-02T05:13:33+05:30 IST