శిథిల భవనాలు.. టెన్షన్‌తో విధులు

ABN , First Publish Date - 2022-09-20T05:26:27+05:30 IST

శిథిల భవనాలు.. పెచ్చులూడుతున్న శ్లాబ్‌లు.. బయటపడుతున్న ఇనుప చువ్వలు.. గోడలపై మొలుస్తున్న పిచ్చిమొక్కలు.. వర్షాలకు తడుస్తున్న రికార్డులు.. ఇదీ జిల్లాలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిస్థితి.

శిథిల భవనాలు.. టెన్షన్‌తో విధులు
విజయనగరం: పెచ్చులూడిన భవనంలో బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది

దయనీయ స్థితిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు
దశాబ్దాల కిందట నిర్మాణం
బిక్కుబిక్కుమంటున్న సిబ్బంది
కలెక్టరేట్‌లోనూ ఇదే దుస్థితి


శిథిల భవనాలు.. పెచ్చులూడుతున్న శ్లాబ్‌లు.. బయటపడుతున్న ఇనుప చువ్వలు.. గోడలపై మొలుస్తున్న పిచ్చిమొక్కలు.. వర్షాలకు తడుస్తున్న రికార్డులు.. ఇదీ జిల్లాలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిస్థితి. ఎన్నో ఏళ్ల కిందట నిర్మాణాలు చేపట్టినవి కావడంతో శిథిలమై ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నాయి. కొన్ని కార్యాలయాల్లో ఫ్యాన్‌ కింద విధులు నిర్వహించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అక్కడకు వివిధ పనులపై వచ్చే ప్రజలు భవనాల పరిస్థితి చూసి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అధికారులకే దిక్కులేకుంటే తమకు ఇంకేం పరిష్కారం చూపుతారని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

విజయనగరం: అది జిల్లా కలెక్టరేట్‌లోని ఎక్సైజ్‌ కార్యాలయం. లోపలి గోడలు, పైకప్పు చూస్తే షాక్‌ అవుతారు. శ్లాబు పెచ్చులూడి అత్యంత దయనీయంగా మారింది. పాడుబడి వదిలేసిన భవనంలా భయటకు కనిపిస్తోంది. ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని చేకూర్చే ఎక్సైజ్‌ కార్యాలయాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయాలకు వెళ్లే మార్గంలోనూ శ్లాబ్‌కు ఉన్న ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తున్నాయి.  

గజపతినగరం: మండలంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఆండ్ర ఇరిగేషన్‌, మండల వనరుల కేంద్రం, తహసీల్దార్‌ కార్యాలయ భవనాలు దారుణంగా తయారయ్యాయి. పాత భవనాలు కావడంతో వర్షాకాలంలో  ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త నిర్మాణాలపై  కోట్ల రూపాయలు ఖర్చు  చేస్తున్నప్పటికీ పాత భవనాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

శృంగవరపుకోట : శిథిలావస్థకు చేరిన శృంగవరపుకోట ప్రభుత్వ పాత ఆసుపత్రి భవనాల గదుల్లో గ్రామ సచివాలయాలు 1,2ను నడుపుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఇక్కడున్న ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి కోసం మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో నూతన భవనాలు నిర్మించారు. దీంతో ఈ ఆసుపత్రి అక్కడకు తరలించారు. అప్పటి నుంచి ఖాళీగా వున్న గదుల్లో ప్రస్తుతం గ్రామ సచివాలయాలు నడుస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయోనని భయంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.

బొబ్బిలి: బొబ్బిలి ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్యాలయాల భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయ పరిస్ధితి చాలా దారుణంగా ఉంది. పూర్తిగా శ్లాబ్‌పెచ్చులూడిపోయి ఎప్పుడు ఎవరిపై పడతాయోనని సిబ్బంది హడలుతున్నారు. ఇరిగేషన్‌ ఇంజనీర్ల కార్యాలయాల దుస్థితీ అంతే.


Read more