కాటేస్తున్నాయ్‌!

ABN , First Publish Date - 2022-09-08T05:33:35+05:30 IST

జిల్లాలో ఎంతోమంది రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్తూ.. పాము కాటుకు గురువుతున్నారు. కొందరు మృతి చెందుతుండగా, ఇంకొందరు సకాలంలో వైద్యం పొంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నారు.

కాటేస్తున్నాయ్‌!

  పాముకాటుకు గురవుతున్న జిల్లావాసులు
  నెల వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు
   ఉద్దవోలులో రైతు మృతి
  అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

(గరుగుబిల్లి/సీతంపేట)


  ఆగస్టు 4న సీతంపేట మండలం గులుమూరు పంచాయతీ ఆడలి గ్రామానికి చెందిన కె.మల్లేసు పొడు వ్యవసాయ పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడు. హుటాహుటిన ఆయన్ని సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
  ఆగస్టు 5న ఇదే మండలం అంటికొండ గ్రామానికి చెందిన అన్నాజీరావు, సుగుణ పొలం పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యారు. వీరిని కూడా ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
 ఇలా ఒకరిద్దరే కాదు.. జిల్లాలో ఎంతోమంది రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్తూ.. పాము కాటుకు గురువుతున్నారు. కొందరు మృతి చెందుతుండగా, ఇంకొందరు సకాలంలో వైద్యం పొంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నారు. మొత్తంగా గత నెలలో సీతం ఏరియా ఆస్పత్రిలో ఎనిమిది కేసులు నమోదయ్యా యంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా గరుగుబిల్లి మండలంలోని ఉద్దవోలుకి చెందిన రైతు కమటాన చిరంజీవి (36) పాము కాటుకు గురై మృతి చెందాడు. బుధవారం గ్రామ శివారులోని పొలానికి  మందు వేయడానికి వెళ్లిన ఆయన కాలిపై పాము కాటు వేసింది. దీంతో ఐదు నిమిషాల్లోనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దీంతో వారు బోరున విలపించారు. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
అవగాహన అవసరం
వర్షాకాలం వ్యాధుల కాలమే కాదు... విష సర్పాలు, తేళ్లు, పురుగులు కూడా బయట అధికంగా సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో  రైతులు, పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  ‘ముఖ్యంగా పాము కాటేయగానే భయపడకూడదు.   కాటు వేసిన చోట నుంచి నడవకూడదు. అలా చేస్తే విషం త్వరగా తలకు చెరుగుతుంది కదలకుండా ఉండడం శ్రేయస్కరం.  ముందుగా ఏ పాము కాటేసిందో గమనించాలి.కాటేసిన ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి, విషం పైకి పోకుండా కట్టువేయాలి. రక్తపింజరి కాటు వేసిన సందర్భాల్లో చిగుళ్లు, మూత్రపిండాల నుంచి రక్తస్రావం ఉంటుంది. నాగు పాము కాటువేస్తే కళ్లు మూతలు పడడం, వాపు రావడంవంటివి ప్రధాన లక్షణాలు. అందుకే రాత్రి వేళల్లో బయటకు వెళ్లినప్పుడు టార్చి లైట్లు వాడాలి. ఇళ్ల వద్ద చెత్తాచెదరం ఉండకుండా చూసుకోవాలి.’ అని నిపుణులు చెబుతున్నారు.  ఏదేమైనా పాము కాటు వేసి సమయం నుంచి గంట వ్యవధిలో వైద్యసేవలు పొందాలి. లేదంటే కష్టమని వైద్యులు తెలియజేస్తున్నారు.  ‘పాము కాటు వేయగానే నాటు వైద్యం పేరుతో  జాప్యం చేయడం మంచిది కాదు..నోటితో విషాన్ని పీల్చరాదు’ అని వారు స్పష్టం చేస్తున్నారు.

 అప్రమత్తంగా ఉండాలి
పాముకాటుకు గురైన వారిని ఆస్పత్రికి సకాలంలో తీసుకొస్తే మెరుగైన వైద్యం అందిచగలం. ప్రాణాపాయం  నుంచి తప్పించగలం. అంతేకానీ గ్రామాల్లో నాటువైద్యం పేరుతో కాలయాపన చేయకూడదు. పాము కాటు బాధితులు  ఆస్పత్రికి వచ్చే వరకూ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి.  పొలం పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి.
- కె.వెంకటరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, సీతంపేట


Updated Date - 2022-09-08T05:33:35+05:30 IST