రిజిర‘స్టే’షన్లు!

ABN , First Publish Date - 2022-03-19T04:36:23+05:30 IST

జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో క్రయ విక్రయదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. అనధికార లేఅవుట్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ఇందుకుగాను ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడుతోంది. సొంత అవసరాలకు జిరాయితీలో కొద్దిపాటి భూమిని విక్రయించేందుకు సైతం అవస్థలు పడుతున్నారు.

రిజిర‘స్టే’షన్లు!
కొత్తవలస సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

జిల్లాలో నత్తనడకన రిజిస్ట్రేషన్లు

ప్రభుత్వ కఠిన నిబంధనలే కారణం

అసౌకర్యానికి గురవుతున్న క్రయవిక్రయదారులు

(కొత్తవలస)

జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో క్రయ విక్రయదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. అనధికార లేఅవుట్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ఇందుకుగాను ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడుతోంది. సొంత అవసరాలకు జిరాయితీలో కొద్దిపాటి భూమిని విక్రయించేందుకు సైతం అవస్థలు పడుతున్నారు. పది సెంట్ల వరకూ భూమి విక్రయించాలన్నా పాసు పుస్తకాలు, 1బీ కాపీలు ఉండాలి. కానీ వీటి రిజిస్ట్రేషన్‌ విషయంలో కూడా నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. పోనీ చదరపు గజాల లెక్కన చేస్తామన్నా కుదరడం లేదు. దీంతో క్రయ విక్రయదారులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నిబంధనల సవరింపుతో  ఉత్తర్వులు కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముందని కార్యాలయ సిబ్బంది చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. 

 వెసులబాటు ఉత్తర్వుల కోసం..

తొలుత అనధికార లేఅవుట్లలో స్థలాల విక్రయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంతో 2019 డిసెంబరు 31లోగా కొనుగోలు చేసుకునే వారు ఎవరికైనా విక్రయించేందుకు వెసులబాటు కల్పించారు. 2020 జనవరి 1 తరువాత జరిగిన కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరపవద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో భవిష్యత్‌ అవసరాల కోసం స్థలాలను కొనుగోలు చేసిన వారు అసౌకర్యానికి గురవుతున్నారు. కొంతమంది ముందుగానే డబ్బులు చెల్లించి.. రిజిస్ట్రేషన్‌ తరువాత చేయించుకుంటారు. ఇటువంటి వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ సవరింపు ఉత్తర్వు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వివాహాలు, శుభకార్యాల సీజన్‌ ప్రారంభం కానుండడంతో అవసరాలకు చాలామంది ఇంటి స్థలాలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రుణాల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ నిబంధనలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నాటి నుంచి అమలుచేసుంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. 10 సెంట్ల వరకూ వ్యవసాయ భూమిని గజాల రూపంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి వెసులబాటు కల్పించాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-03-19T04:36:23+05:30 IST