చిరునవ్వుతో స్వీకరించండి

ABN , First Publish Date - 2022-02-17T04:42:43+05:30 IST

‘స్పందన’లో ప్రజల నుంచి వస్తున్న వినతులను చిరునవ్వుతో స్వీకరించి కుణ్ణంగా పరిశీలించాలని... మనసు పెట్టి పరిష్కారం చూపాలని సీఎంవో కార్యదర్శితో పాటు వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి అధికారులు సూచించారు.

చిరునవ్వుతో స్వీకరించండి
మాట్లాడుతున్న సీఎంవో కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌

మనసు పెట్టి స్పందించండి

‘స్పందన’ వర్క్‌షాపులో సీఎంఓ కార్యదర్శి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 16: ‘స్పందన’లో ప్రజల నుంచి వస్తున్న వినతులను చిరునవ్వుతో స్వీకరించి కుణ్ణంగా పరిశీలించాలని... మనసు పెట్టి పరిష్కారం చూపాలని సీఎంవో కార్యదర్శితో పాటు వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి అధికారులు సూచించారు. ప్రజలు సంతృప్తి చెందేలా అంతిమ పరిష్కారం ఉండాలన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి  సీఎంవో కార్యదర్శులు సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, హరికృష్ణ, ఇతర అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్‌ సూర్యకుమారి తొలుత జిల్లాలో ఉన్న సమస్యలను కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా నెట్‌వర్క్‌ సమస్య ఉందని, దీనివల్ల అధికంగా వినతులు పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. ఈ వర్క్‌షాప్‌ స్ఫూర్తితో ఇకపై చర్చకు వచ్చిన ప్రతి అంశాన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం ఆశించిన మేరకు ఫలితాలు సాధిస్తామని తెలిపారు. సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతామని కలెక్టర్‌ చెప్పారు. అనంతరం సీఎంవో కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన వినతులకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజలు అందజేసిన విన్నపాలను కుణ్ణంగా చదివి వాటి పరిష్కారం కోసం సరైన అధికారికి అప్పగించాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే అర్జీదారునికి వెంటనే తెలియజేయాలని సూచించారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. స్పందన వినతుల పరిష్కారంలో గణనీయమైన మార్పులు తీసుకురావాలన్నారు. ఈ విషయంలో మన రాషా్ట్రన్ని దేశంలోనే నెంబరు 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు.

 ‘స్పందన’ కార్యక్రమం జవాబుదారీతనానికి చిరునామాగా ఉండాలని మరో సీఎంవో కార్యదర్శి హరికృష్ణ చెప్పారు. చిన్నచిన్న సమస్యల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటి పరిష్కారం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం సూచించారని తెలిపారు. అందుకు అందరూ బాధ్యతగా పని చేయాలన్నారు. అర్జీ పెట్టుకున్న వ్యక్తికి పూర్తి భరోసా ఇవ్వాలని చెప్పారు. 

 అర్జీదారుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ హెచ్చరించారు. ‘స్పందన’పై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. కొంతమంది అధికారుల ప్రవర్తన పట్ల ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రెండున్నరేళ్ల తరువాత కూడా వారిలో మార్పు రాలేదని అన్నారు. వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని చెప్పారు. 

 క్షేత్ర స్థాయి అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై జిల్లా స్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి అజయ్‌ జైన్‌ అన్నారు. పథకాలకు సంబంధించి అర్హతలు, అనర్హతలపై అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. వినతులపై ఉదారభావం ప్రదర్శించరాదని హెచ్చరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి పనితీరు ఇంకా మెరుగుపడాలని, లబ్ధిదారుల్లో విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ ఎన్‌.తేజ్‌భరత్‌, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్‌ శాంతిప్రియ పాండే, పౌర సరఫరాల శాఖ సంచాలకుడు ఢిల్లీరావులు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కార్యదర్శి రామ్మోహన్‌రావు, జేసీలు కిషోర్‌కుమార్‌, మహేష్‌కుమార్‌, మయూర్‌అశోక్‌, వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, వివిధ విభాగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-17T04:42:43+05:30 IST