చదివింది ఏడు.. పట్టుభద్రుని ఓటు

ABN , First Publish Date - 2022-11-29T00:12:52+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను చూసి పట్టభద్రులు ఖంగుతింటున్నారు. ఎన్నెన్నో వింతలు, విశేషాలు చూసి ఓటు హక్కు ఇలాకూడా పొందవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఓటరుగా అర్హత పొందడానికి కనీసం పట్టభద్రులై ఉండాలన్నది నిబంధన.

చదివింది ఏడు.. పట్టుభద్రుని ఓటు
తప్పులతో నిండిన పట్టభద్రుల ఓటర్ల జాబితా

నిరక్షరాస్యులకూ హక్కు

లోపభూయిష్టంగా పట్టభద్రుల ఓటర్ల జాబితా

అన్హులకు చోటు

బొబ్బిలి, నవంబరు 28:

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను చూసి పట్టభద్రులు ఖంగుతింటున్నారు. ఎన్నెన్నో వింతలు, విశేషాలు చూసి ఓటు హక్కు ఇలాకూడా పొందవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఓటరుగా అర్హత పొందడానికి కనీసం పట్టభద్రులై ఉండాలన్నది నిబంధన. కాగా అధికారులు విడుదల చేసిన జాబితాలో కొంతమంది ఓటర్ల పేరు చివరన నిరక్షరాస్యుడని, ఏడో తరగతి పాస్‌ అని , టెన్త్‌ క్లాస్‌ అని ఇలా రకరకాలుగా పొందుపరిచి ఉంది. పట్టభద్రులు కాదు అనుకుంటే ఆ పేర్లను ఎందుకు నమోదు చేశారో తెలియక ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రతినిధులు జుట్టుపీక్కుంటున్నారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఈ వింతలన్నీ కనిపించాయి.

- బొబ్బిలి పట్టణంలోని బూత్‌నెంబరు 86లోని సీరియల్‌ నెంబరు-62లో ప్రసాదరావు, 277లో కె.సంతోష్‌ , 308లో ఆర్‌.చంటి పేర్లకు ఎదురుగా ఇల్లిట్రేట్‌ అని ఉంది. ప్రభుత్వ హైస్కూలులో సీనియర్‌ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఎస్‌వీ రమణమూర్తి పేరు (సీరియల్‌ నెంబరు -100)కు చివరలో ఎటువంటి అర్హతనూ పేర్కొనలేదు. కె.భాస్కరరావు సెవెన్త్‌ అని టి.ఉదయ్‌కుమార్‌ మెట్రిక్యులేషన్‌గా ఎ.లవకుమార్‌ సెవెన్త్‌గా పేర్కొని ఉంది. బూత్‌నెంబరు 85 నుంచి 88 వరకు జాబితాలో ఓటర్లకు అర్హత కలిగిన విద్య లేదన్నట్లు, కొంతమందికి అసలు క్వాలిఫికేషన్‌ లేనట్లు, ఇంకొంతమందికి ఇల్లిట్రేట్‌ (నిరక్షరాస్యుడని)ఉండడం గమనార్హం.

- రామభద్రపురం మండలానికి సంబంధించి యజ్జల ప్రతాప్‌కుమార్‌ టెన్త్‌ ఫెయిల్‌, మీసాల అప్పలరాజు ఎస్‌ఎస్‌సీ, మామిడివలసకు చెందిన ఆకుల చిన్నంనాయుడు ఇంటర్‌, తెర్లాం మండలం కొల్లివలసకు చెందిన బలగ సుమతి టెన్త్‌, చిన్నయ్యపేటకు చెందిన చప్ప మధు నిల్‌ అని పొందు పరిచారు. ఇంకా సిరిపురపు రామ్మోహనరావు, అరసాడ సాగర్‌బాబు, బన్నా సుశీల, దార్లంకి చంద్రశేఖర్‌, చల్లారాపు అప్పలనాయుడు, దాసరి సుధ, రాధాకుమారి ఇలా అనేక మంది పేర్లకు ఎదురుగా ఎటువంటి విద్యార్హతను పొందుపరచకపోవడం గమనార్హం.

ఈసీకి ఫిర్యాదు చేస్తాం

పట్టభద్రుల ఓటర్ల నమోదు కోసం అధికారులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వారికి మద్దతుగా మేము కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. పట్టభద్రులైతేనే ఓటు హక్కు ఉంటుందనేది బహిరంగ రహస్యం. కొంతమంది ఓటర్లకు ఎటువంటి అర్హత లేనట్లు, నిరక్షరాస్యులుగా చూపుతూ ముసాయిదా జాబితా విడుదల చేయడం అన్యాయం. ఇది చాలా వింతగా ఉంది. సరిచేయకుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.

- కె.విజయగౌరి, ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాల నేత

తప్పులు దొర్లితే కఠిన చర్యలు

ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. తుది జాబితాను విడుదల చేసినప్పుడు ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూస్తాం. చాలా సీరియస్‌గా ప్రక్రియ ఉంటుంది. ముసాయిదా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించాను.

- పి.శేషశైలజ, ఆర్డీవో, బొబ్బిలి

వాటిని తొలగిస్తాం

ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమే. తపొప్పులుంటే వెంటనే వాటిని పరిశీలించి తుది జాబితాలో వాటిని తొలగిస్తాం. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తాం. డిసెంబరు 9 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరిస్తాం. నెలాఖరుకల్లా తుది జాబితా విడుదల చేస్తాం.

- ఎన్‌.రాజారావు, తహసీల్దారు, బొబ్బిలి

Updated Date - 2022-11-29T00:12:54+05:30 IST