ఆర్బీకేలు.. పేరు మార్పు!

ABN , First Publish Date - 2022-06-08T05:25:54+05:30 IST

ఇప్పటికే ఉమ్మడి జిల్లా విజయనగరంలో ఆర్బీకే పేరును ‘ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం’గా మార్చారు. దశల వారీగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వాటి పేరును మార్చడానికి రంగం సిద్ధమవుతోంది.

ఆర్బీకేలు..  పేరు మార్పు!
సాలూరు మండలం కొత్తవలసలో రైతు భరోసా కేంద్రం

  వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రంగా మార్చేంచుకు చర్యలు

  90 శాతం ఉపాధి నిధులతో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం

  రాష్ట్ర సర్కారు వాటా 10 శాతమే...

  బీజేపీ నాయకుల ఫిర్యాదుతో కేంద్రం ఆదేశాలు

  అమలు చేసే పనిలో అధికారులు 


(సాలూరు)


ఈ  ఫొటో చూశారా! పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో రైతు భరోసా కేంద్రం.   ఇటీవల దాని పేరును ‘ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం’గా మార్పు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే పేరును ఎందుకిలా మార్చారో ఇప్పుడు తెలుసుకుందాం. 

విత్తనం నుంచి విక్రయం వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించేలా ఆర్బీకేలు పనిచేస్తాయని ఎంతో గొప్పగా సీఎం జగన్‌ పలుమార్లు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ ఎలా ఉన్నా.. అసలు విషయం తెలిస్తే.. ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఈ ఆర్బీకేల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు సమకూరుస్తోంది. రాష్ట్ర సర్కారు కేవలం పది శాతం మాత్రమే నిధులు అందిస్తూ.. ఇదంతా తమ గొప్పతనమే అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. దీనిని గమనించిన బీజేపీ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వాటి పేర్లు మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా విజయనగరంలో ఆర్బీకే పేరును  ‘ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం’గా మార్చారు. దశల వారీగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వాటి పేరును మార్చడానికి రంగం సిద్ధమవుతోంది. 

  జిల్లాలో ఇదీ పరిస్థితి.. 

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, సంక్షేమ పథకాల పంపిణీ చేసేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేయాలని భావించారు. వాటి ద్వారా సాగుపై అవగాహన , సలహా సూచనలు అందించాలని నిర్ణయించారు.  ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో 306 రైతు భరోసా కేంద్రాలకు గాను 302 భవనాల నిర్మాణాన్ని  ఉపాఽధి హామీ పథకం  కింద  చేపడుతున్నారు.  ప్రస్తుతం అవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.   90 శాతం ఉపాధి హామీ నిధులు, పది శాతం రాష్ట్ర వ్యవసాయ శాఖ నిధులతో వాటిని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటివరకూ జిల్లాలో కేవలం 22 ఆర్బీకేల నిర్మాణాలే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.  అయితే  కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తూ ఆర్బీకేలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టడం ఏమిటని బీజేపీ నాయకులు ఫిర్యాదుతో కేంద్రం స్పందించింది.  ఈ మేరకు ఇకపై నిర్మాణాలు పూర్తయిన భవనాలకు త్వరలో ‘ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం’గా పేరు మార్పు చేయనున్నట్లు తెలిసింది.  ఇప్పటికే పలు చోట్ల అగ్రికల్చర్‌ స్టోరేజ్‌ యూనిట్‌ గా ఆంగ్లంలో పేరు మారుస్తూ..   పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. దీంతో ఆర్బీకేల పేరు కాస్త వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రంగా మారాయి.  ఇప్పటికే పూర్తయిన ఆర్బీకేల పేర్లు మారవని కొందరు అధికారులు చెబుతున్నారు. 

    న్యూస్‌ చూశాను

రైతు భరోసా కేంద్రాలకు పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు న్యూస్‌ చూశాను. త్వరలో మాకు ఆదే శాలు రావచ్చు.  ఆదేశాలు వచ్చిన తర్వాత ఆర్బీకేల పేర్లు మారవచ్చు. 

- రాబర్ట్‌పాల్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, పార్వతీపురం  


ఆదేశాలు వచ్చాయి  

ఆర్బీకేల పేరు మార్చాలని మాకు ఆదేశాలు వచ్చాయి. వాటి నిర్మాణానికి  కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరుస్తోంది. ఈ మేరకు ఇకపై నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలకు  వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రంగా పేరు రాయాల్సి ఉంది. ఇప్పటికే పూర్తయిన భవనాల పేర్లు మారవు. 

- లోకనాథం,ఏఈ, పంచాయతీరాజ్‌ శాఖ, సాలూరు



Updated Date - 2022-06-08T05:25:54+05:30 IST