-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Rain throughout-MRGS-AndhraPradesh
-
అంతటా వాన
ABN , First Publish Date - 2022-09-09T04:49:21+05:30 IST
పశ్చిమ మఽధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది.

తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ భోగాపురం, సెప్టెంబరు 8: పశ్చిమ మఽధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణంలో మార్పు కన్పించింది. వారం రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు కాయడంతో విసుగెత్తిన ప్రజలు ఈ వానలకు ఊరట చెందుతున్నారు. వరి పంటకు కూడా చాలా మేలని రైతులు చెబుతున్నారు. విజయనగరం, బొబ్బిలి, రాజాం, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, గంట్యాడ, తెర్లాం, రామభద్రపురం, ఎల్.కోట, ఎస్‌కోట, వేపాడ, నెల్లిమర్ల తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. డెంకాడ, భోగాపురం తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఎప్పటిలాగే రోడ్లు, పల్లపు ప్రాంతాలు చెరువులను తలపించాయి. మార్కెట్, అంబటిసత్తర్వు నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు రోడ్డు, చినమార్కెట్, నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంతంలో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అల్లకల్లోలంగా సముద్రం
సముద్రం అల్లకల్లోలంగా మారింది. భోగాపురం మండలం ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు పరిధిలో పెద్ద ఎత్తులో కెరటాలు వచ్చి తీరాన్ని తాకుతున్నాయి. సముద్రంలోకి మత్స్యకారులెవరూ వేటకు వెళ్లలేదు. పడవలు, వలలు, వేటసామగ్రిని సురక్షిత ప్రాంతానికి తరలించుకొంటున్నారు.