పాలనా రాజధానికి రూట్‌మ్యాప్‌ సిద్ధం

ABN , First Publish Date - 2022-12-12T02:27:44+05:30 IST

విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

పాలనా రాజధానికి రూట్‌మ్యాప్‌ సిద్ధం

విశాఖలోవేగంగా రాజధాని ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు జనవరిలో శంకుస్థాపన: బొత్స

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 11: విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రూట్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే విశాఖను రాజధానిగా చేస్తున్నామని.. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆదివారమిక్కడ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం పనులకు జనవరిలో శంకుస్థాపన జరుగనుందని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తల ఫోన్లకూ అందుబాటులో ఉండడం లేదని.. ఇలాగైతే పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ.. పార్టీ కోసం అహోరాత్రులూ కష్టించి పనిచేసే కొంత మంది నాయకులు, కార్యకర్తలకు పదవులు రాలేదని, వారంతా నిరుత్సాహంతో ఉన్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కాకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. బిల్లులను సంక్రాంతిలోగా చెల్లించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామ న్నారు. చంద్రబాబు నోరువిప్పితే అవాస్తవాలు మాట్లాడుతున్నారని, 2014 నుంచి 19 వరకూ ఏమి చేయలేని కారణంగానే ఆయన్ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కూడా మాట్లాడారు.

Updated Date - 2022-12-12T02:27:44+05:30 IST

Read more