ఒక పోర్షన్‌ వరకే!

ABN , First Publish Date - 2022-11-08T00:12:30+05:30 IST

ఎస్‌.కోట పుణ్యగిరి రోడ్డులో జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఓ లబ్ధిదారుడు ఇలా రెండు అంతస్తులు నిర్మించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో తహసీల్దారు శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో పాత్రోతో పాటు సచివాలయ ఉద్యోగులు పరిశీలించారు.

ఒక పోర్షన్‌ వరకే!
లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ఒక పోర్షన్‌ వరకే!

మరో అంతస్తు కడతామంటే కుదరదు

జి+1కు అనుమతులు లేవు

అధికారుల అభ్యంతరాలు

జీవోలో ఎక్కడుందని ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు

జగనన్న లేవుట్‌లో ఇళ్ల నిర్మాణంపై స్పష్టత కరువు

(శృంగవరపుకోట)

ఎస్‌.కోట పుణ్యగిరి రోడ్డులో జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఓ లబ్ధిదారుడు ఇలా రెండు అంతస్తులు నిర్మించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో తహసీల్దారు శ్రీనివాసరావు, పంచాయతీ ఈవో పాత్రోతో పాటు సచివాలయ ఉద్యోగులు పరిశీలించారు. వారం రోజుల్లో పై అంతస్తును తొలగించాలని లబ్ధిదారుడికి నోటీసు అందించారు. అయితే ఇలా కట్టకూడదన్న నిబంధన ఎక్కడుందో చూపించాలని లబ్ధిదారుడు ప్రశ్నించడంతో అధికారులు కంగుతిన్నారు. అనుమానాన్ని నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.

గృహ నిర్మాణం విషయంలో లక్ష్యాలు, గడువులు, సవాలక్ష నిబంధనలు పెట్టే అధికారులకు ఇలా చిన్నపాటి అంశంపై అవగాహన లేకపోవడం విశేషం. పేదల సొంతింటి కల సాకారానికి జగనన్న లేవుట్లు ఏర్పాటుచేసి ఇళ్ల పట్టాలు అందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే సెంటున్నర భూమిలో ఇల్లు ఎలా కట్టాలని లబ్ధిదారులు విముఖత చూపుతూ ఉన్నారు. కానీ రకరాల ఒత్తిళ్లు చేసి వారితో పనులు ప్రారంభింపజేస్తున్నారు. అయితే ఇంటి అవసరాలు, కుటుంబసభ్యులు ఎక్కువగా ఉన్నవారు.. ప్రత్యేకంగా రెండో అంతస్తు (జీ+1) నిర్మాణం చేపడుతున్నారు. కానీ ఎక్కడికక్కడే అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో లబ్ధిదారులు అడుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. రెండో అంతస్తు నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని నేరుగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికి నిర్మాణాలు నిలిపివేయండి అని మాత్రమే చెప్పగలుగుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి జీవో జారీచేయలేదు. అలాగని అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

కుటుంబ అవసరాల కోసం..

వాస్తవానికి సెంటున్నర భూమిలో ఇంటి నిర్మాణం ఏమంత ఉపయోగం కాదని లబ్ధిదారుల నుంచి వినిపిస్తోంది. సాక్షాత్‌ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రభుత్వం ఇచ్చే స్థలంలో ఇల్లు కట్టుకుంటే.. ఒకరు పడుకుంటే..మరొకరు కూర్చోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇవి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా నగర, పట్టణ లబ్ధిదారులు ప్రభుత్వం అందించే లేఅవుట్‌ స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. అటువంటి వారు సెంటున్నర స్థలంలో కట్టిన ఇంటిపై మరో అంతస్తు నిర్మించాలని భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబ అవసరాలు దాటిపోతాయని యోచిస్తున్నారు. రెండు అంతస్తులు పూర్తయితేనే ఇంటికి తుది రూపం వస్తుందని.. ఒక పోర్షన్‌ తో మాత్రం ఇంటి అవసరాలు తీరవని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయడం లేదు.

ఆ పని ఏ శాఖది?

కాలనీల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలుతో పాటు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే వరకూ అనదపు సౌకర్యాలు పొందకూడదని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల స్థలాలను రెవెన్యూ శాఖ సమకూర్చింది. ఇళ్ల నిర్మాణ బాధ్యత హౌసింగ్‌ శాఖది. పట్టా, పొజిషన్‌ సర్టిఫికేట్‌ ఆధారంగా ఇంటిని నిర్మిస్తారు. లేఅవుట్‌లో నిర్మించే ఇంటికి పంచాయతీ ఎటువంటి అనుమతి ఇవ్వదు. లేఅవుట్‌లో మొత్తం ఇళ్లు పూర్తయితే పంచాయతీకి అప్పగిస్తారు. ఇదీ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం ప్రణాళిక. అయితే చాలామంది మరో అంతస్తు నిర్మాణం చేపడుతుండడంతో ఏ శాఖ అడ్డుకోవాలో అన్నది స్పష్టత లేదు. కొందరికి మరో అంతస్తు కట్టాలని ఉన్నా బిల్లులు మంజూరవుతాయో లేదో అన్న బెంగతో వెనుకడుగు వేస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు పేదలకు అందించిన కాలనీలు, ఇళ్ల విషయంలో బహుళ అంతస్తులు వెలిశాయి. కానీ అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మునిసిపాల్టీలు, పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు వెలుస్తున్నాయి. అటువంటి వాటి విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టని అధికారులు.. మా విషయంలో మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు పాటించకపోతే చివరకు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటోందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కలెక్టర్‌కు నివేదించాం

లేఅవుట్‌లో మరో అంతస్తు నిర్మాణం విషయమై కలెక్టర్‌కు నివేదించాం. అక్కడ నుంచి ఆదేశాలు వచ్చేవరకూ నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చాం. ఇప్పటికే పంచాయతీపరంగా లబ్ధిదారుడికి నోటీసులు అందాయి. అటు గృహనిర్మాణ శాఖ అభిప్రాయాన్ని సైతం కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం.

డి.శ్రీనివాసరావు, తహసీల్ధార్‌, శృంగవరపుకోట

Updated Date - 2022-11-08T00:12:30+05:30 IST

Read more