ఒడిశాలో కాదు..ఆంధ్రాలో ఉంటాం

ABN , First Publish Date - 2022-12-07T00:14:12+05:30 IST

ఒడిశాలో తాముండమని, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని కొఠియా గ్రూప్‌నకు చెందిన గిరిజనులు స్పష్టం చేశారు.

ఒడిశాలో కాదు..ఆంధ్రాలో ఉంటాం
ఒడిశా వద్దంటు నేరేళ్లవలసలో ధర్నా చేస్తున్న గిరిజనులు

సాలూరు రూరల్‌, డిసెంబరు 6: ఒడిశాలో తాముండమని, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని కొఠియా గ్రూప్‌నకు చెందిన గిరిజనులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఎగువశెంబి, ధూళిభద్ర, దిగువశెంబి, దొరలతాడివలస తదితర గ్రామాలకు చెందిన గిరిపుత్రులు నేరేళ్లవలసలో ధర్నా చేశారు. ఒడిశా తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం తమ పిల్లలు తెలుగులోనే చదువుతున్నారని, ఏపీలోని వివిధ వసతిగృహాల్లో ఉంటున్నారని తెలిపారు. ఆంధ్ర అధికారులు సంక్షేమ పథకాలు అందిస్తూ.. తమ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ఒడిశా వద్దని, ఆంధ్రలోనే ఉంటామని గతంలోనే తాము తీర్మానం చేసి ఇచ్చామన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగుల న్యాయసలహాదారు రేగు మహేశ్వరరావు మాట్లాడుతూ.. కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఏపీ అధికారులు,సేవలను అడ్డుకుంటే సుప్రీం కోర్టులో ఒడిశాపై కోర్టు ధిక్కారణ కేసు వేస్తామన్నారు. కొఠియా వివాదంపై 1968లోనే సుప్రీంకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని గతంలో కోర్టు చెప్పిందన్నారు. కొఠియా గ్రూప్‌ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు కూడా తాము ఏపీలోనే ఉంటామని పంచాయతీ తీర్మానాలు చేసి సుప్రీంలో కేసు ( రిట్‌ పిటిషన్‌ నెంబర్‌ 113/2022 ) వేశారని తెలిపారు. కొఠియాపై ఇరు రాష్ట్రాలకు హక్కు ఉందని చెప్పారు. ఏపీ అధికారులను అడ్డుకునే హక్కు ఒడిశా వారికి లేదని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో దిగువ గంజాయిభద్రకు చెందిన గిరిజన నాయకుడు గెమ్మెల బీసు , పాలవలస రామ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:14:13+05:30 IST