వద్దే వద్దు

ABN , First Publish Date - 2022-07-08T05:19:40+05:30 IST

పాఠశాలల విలీనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. విలీనం వద్దుగాక వద్దు అంటూ నినదిస్తున్నారు. అనేక చోట్ల పాఠశాలలకు గురువారం తాళం వేశారు. అక్కడే ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వద్దే వద్దు
ఎస్‌.కోట: పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

పాఠశాలల విలీనంపై నిరసనల సెగలు
స్కూళ్లకు తాళం వేసిన తల్లిదండ్రులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు


పాఠశాలల విలీనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు ఉద్యమిస్తున్నారు. విలీనం వద్దుగాక వద్దు అంటూ నినదిస్తున్నారు. అనేక చోట్ల పాఠశాలలకు గురువారం తాళం వేశారు. అక్కడే ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఇంకొన్ని చోట్ల కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నిరసనలు తెలిపాక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జామి నెయ్యిలవీధిలో పాఠశాలకు తాళం
జామి : ప్రాథమిక పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ జామి నెయ్యిలవీధి పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఉదయం తాళం వేశారు. అనంతరం అక్కడే నినాదాలు చేశారు. గ్రామంలోని పాఠశాలను కిలోమీటరు కన్నా ఎక్కువ దూరంలో ఉన్న పాఠశాలలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన మార్గాన్ని దాటి వెళ్లాల్సి ఉంటుందని, రోడ్డు పనులు జరుగుతుండడంతో పిల్లల ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను స్కూల్‌కు పంపేదిలేదని, టీసీలు తీసుకుని ఇంటివద్దే ఉంచేస్తామన్నారు.  అనంతరం అక్కడకు పోలీసులు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. దీంతో వారంతా మండల విద్యా వనరుల కేంద్రానికి వెళ్లి ఎంఈవోకు పాఠశాల విలీనం వద్దని చెబుతూ వినతిపత్రం ఇచ్చారు.
 అల్లువీధిలోనూ పాఠశాల విలీనం వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తంచేశారు.
 జామి మండలంలోని తాండ్రంగి పాఠశాలను ఎస్‌.కోట మండలం కొట్టాం పాఠశాలలో విలీనం చేయడంతో అక్కడ కూడా తల్లిదండ్రులు నిరసన తెలిపారు.


మునకలవలస పాఠశాల వద్ద నిరసన
రేగిడి, జూలై 7:
మునకలవలస పాఠశాలకు చెందిన 6,7, 8 తరగతి విద్యార్థులను దాదాపు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న పనసలవలస హైస్కూల్‌లో విలీనం చేయడాన్ని మునకలవలస గ్రామస్థులు, విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. సర్పంచ్‌ వి.చంద్రశేఖర్‌, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ లావేటి లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం పాఠశాలకు తాళం వేసి గేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను బయటకు పంపి సీఎం జగన్‌ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈపాఠశాలలో 157 మంది విద్యార్థులు చదువుతుండగా  6,7, 8 తరగతుల నుంచి 62 మంది ఉన్నారు. వీరంతా రవాణా సౌకర్యం లేని పనసలవలస హైస్కూల్‌ వెళ్లాల్సి రావడంతో గ్రామస్థులు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సర్పంచ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు.


ఆరుబయటే ఉపాధ్యాయులు
నిరసనలో భాగంగా గామస్థులు పాఠశాలకు తాళం వేయడంతో ఉపాధ్యాయులు సాయంత్రం వరకు అరుబయటే ఉండిపోయారు. హెచ్‌ఎం సూర్యకుమారి, తోటి ఉపాధ్యాయులు ఎంఈవోకు సమాచారం అందించారు. ఎంఈవో వరప్రసాదరావు పాఠశాలను సందర్శించి గ్రామస్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు అంగీకరించలేదు. వారి వద్ద నుంచి వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు.

 ఎస్‌.కోట శ్రీనివాసకాలనీలో..
 శృంగవరపుకోట, జూలై 7:
శృంగవరపుకోట శ్రీనివాసకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3, 4,5 తరగతుల విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. గురువారం ఉదయం పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ పాఠశాలను ఇక్కడ నుంచి తరలిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలకు రద్దీగా ఉండే విశాఖ-అరకు రోడ్డులో వెళ్లాల్సి వస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, మాజీ ఎంపీటీసీ గన్ను బంగారమ్మ, టీడీపీ నాయకులు కొణదం మల్దేశ్వరరావు, కాపుగంటి శ్రీనివాసరావు, సీపీఐ నాయకులు డేగల అప్పలరాజు, మద్ది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సూపరింటెండెంట్‌కు వినతి
కొత్తవలస, జూలై 7:
ముసిరాం గ్రామ ప్రాథమిక పాఠశాలలోని 5,6,7 తరగతులను లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి హైస్కూల్‌లో విలీనం చేయడాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులుఅభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలకు గురువారం తాళం వేశారు. పిల్లలను మండలంలోని వియ్యంపేట హైస్కూల్‌కైనా పంపుతాము గాని, కళ్లేపల్లి పంపించే ప్రసక్తే లేదన్నారు.
ఫ కంటకాపల్లి పంచాయతీ సాంబయ్యపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను కంటకాపల్లి హైస్కూల్‌లో విలీనం చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ట్రాక్‌ను దాటుకుని వెళ్లాల్సి రావడంతో అంగీకరించేదిలేదన్నారు.  దీనిపై ఎంపీడీవో కార్యాలయంలోని సూపరింటెండెంట్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.

ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు
కొత్తవలస, జూలై 7:
పాఠశాలల విలీనం ప్రక్రియతో కొత్తవలస మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల్లో జోష్‌ కనిపిస్తోంది. వివిధ గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు మూడు కిలోమీటర్లు నడిపించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించేకంటే గ్రామంలోకే వచ్చే స్కూల్‌ బస్సులో దూరంగానైనా పంపించడం మేలని భావిస్తున్నారు. మండలంలోని ప్రైవేటు స్కూళ్లలో క్రమంగా అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ముసిరాం పాఠశాలను లక్కవరపుకోట మండలం కళ్లేపల్లిలో విలీనం చేయడంతో ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చేరిపోవడానికి సిద్ధమవుతున్నారు. దేవాడ పాఠశాలను వియ్యంపేటలోను, కాటకాపల్లి పాఠశాలను గొల్లపేటగ్రామంలోనూ, గాంధీనగర్‌లో నున్న పాఠశాలను ఉత్తరాపల్లిలోనూ, సాంబయ్యపాలెం పాఠశాలను కంటకాపల్లిలోనూ విలీనం చేయడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులందరూ ప్రైవేటు పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అప్పన్నపాలెంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 300 మంది విద్యార్థులు చేరినట్టు సమాచారం.

ఎరుకులపాకల గ్రామంలో..
బాడంగి, జూలై 7:
లక్ష్మీపురం శివారు గ్రామమైన ఎరుకులపాకలలో ఉన్న పాఠశాలను ఎత్తివేసి పక్క పంచాయతీ గజరాయనివలస స్కూల్‌లో కలపడాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా నిరసించారు. ఎంపీటీసీ పాలవలస గౌరు, సర్పంచ్‌ పార్వతి ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. సర్పంచ్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఈ గ్రామంలో వైసీపీకి తక్కువ ఓట్లు వచ్చాయని, వారే కక్షకట్టి పాఠశాలను విలీనం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టుకు వెళ్తాం
మెంటాడ, జూలై 7:
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వెళితే కోర్టును ఆశ్రయించి తమ హక్కులను దక్కించుకుంటామని ఇప్పలవలస ఎంపీటీసీ సభ్యుడు గుమ్మిడి ప్రవీణ్‌, సర్పంచ్‌ గెడ్డ పైడిరాజు హెచ్చరించారు. ఇప్పలవలస ప్రాథమిక పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇప్పలవలస పాఠశాల విద్యార్థులను జయతి హైస్కూలులో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరే కించారు. అరవయ్యేళ్లుగా పాఠశాలను అభివృద్ధి చేశామని గ్రామపెద్దలు గెద్ద అన్నవరం, నాగరాజు, సర్పంచ్‌ పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రోత్సహించకపోయినా పరవాలేదని, ఉన్నవాటిని ఎత్తివేయవద్దన్నారు.


Updated Date - 2022-07-08T05:19:40+05:30 IST