భవనాల్లేవు.. కుర్చీల్లేవు!

ABN , First Publish Date - 2022-11-29T00:20:55+05:30 IST

గిరిజనులకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో సీతంపేట మండలంలో కొత్తగా 29 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అయితే నిధులు మాత్రం కేటాయించడం లేదు.

భవనాల్లేవు.. కుర్చీల్లేవు!
చిన్నపల్లంకిలో చెట్టు కింద గ్రామసభ నిర్వహిస్తున్న దృశ్యం

చెట్ల కిందే గ్రామ సభల నిర్వహణ

టర్పాలిన్లు పర్చుకుని కిందనే కూర్చోవాల్సిన దుస్థితి

నిధులు కేటాయించని సర్కారు

రెండేళ్లుగా మౌలిక వసతులు కల్పించని వైనం

మండిపడుతున్న గిరిజనులు

(సీతంపేట)

గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో గిరిపుత్రులకు అవస్థలు తప్పడం లేదు. ఇందుకు సీతంపేట మన్యంలో నెలకొన్న పరిస్థితే నిదర్శనంగా చెప్పొచ్చు. వాస్తవంగా గిరిజనులకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో సీతంపేట మండలంలో కొత్తగా 29 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అయితే నిధులు మాత్రం కేటాయించడం లేదు. మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు. ఇప్పటికీ ఆయా పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవు. గ్రామసభకు హాజరైన వారికి కనీసం కుర్చీలు కూడా వేయలేని దుస్థితి. దీంతో టర్పాలిన్లు పర్చుకుని కిందనే కూర్చోవాల్సి వస్తోంది. మొత్తంగా సర్కారు తీరుతో సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా కనీస వసతులు సమకూర్చకపోవడంపై ఆయా గ్రామస్థులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా సీతంపేట మండలంలో గతంలో 24 పంచాయతీలు ఉండేవి. పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి 500 కుటుంబాలకు ఒక పంచాయతీ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా 29 పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో మండలంలో పంచాయతీల సంఖ్య 53కి చేరింది. అయితే కొత్త పంచాయతీల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రధానంగా ఈతమానుగూడ, పెద్దగూడ, మానాపురం, నాయకమ్మగూడ, దుగ్గి, తాలాడ, వజ్జాయిగూడ, కుమ్మరగండి, చిన్నపల్లంకి, తుంబకొండ, గులుమూరు, కిండంగి, చాకలిగూడ, రోలుగుడ్డి, కె.వీరఘట్టం, తాడిపాయి, చింతాడ, కిరప, పాతపనుకువలస, శిలగాం, నల్లరాయిగూడ గ్రామాలకు కనీసం జనరల్‌ ఫండ్‌ కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా అయితే పాలన ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు నామమాత్రంగా కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు చాలడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా మండలంలో ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా 31 సచివాలయాలు ఉండగా వాటి పరిధిలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు విలీనమైనప్పటికీ వాటికి భవనాలు లేవు. దీంతో చెట్ల కిందే పంచాయతీలు నిర్వహించాల్సిన దుస్థితి. గ్రామాల్లో సమావేశాలు జరిపినప్పుడు సర్పంచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీకి వచ్చిన అధికారులకూ కుర్చీలు కూడా వేయలేని స్థితిలో ఉన్నారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని సర్పంచ్‌లు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో భవన నిర్మాణాలకు ఎంపీ మంజూరు చేయాలని, తాగునీరు, రోడ్లు, కాలువల సమస్యలను కూడా పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సీతంపేట ఈవోపీఆర్‌డీ కొండపల్లి సత్యం వద్ద ప్రస్తావించగా కొత్తగా ఏర్పడిన పంచాయతీల భవన నిర్మాణాలకి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఆయన తెలిపారు. మౌలిక సౌకర్యాల కల్పనకు జనరల్‌ ఫండ్‌ నుంచి సమకూర్చుకోవాలని సర్పంచ్‌లకు స్పష్టం చేశామన్నారు.

Updated Date - 2022-11-29T00:20:56+05:30 IST