-
-
Home » Andhra Pradesh » Vizianagaram » National Level Chess Competitions in Vizianagaram-MRGS-AndhraPradesh
-
విజయనగరంలో జాతీయ స్థాయి చెస్ పోటీలు
ABN , First Publish Date - 2022-09-09T04:48:15+05:30 IST
జిల్లాలో తొలిసారిగా జాతీయ స్థాయి చదరంగం పోటీలు జరుగనున్నాయి. వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించనున్నట్టు నిర్వాహక కమిటీ చైర్మన్ భీశెట్టిబాబ్జీ తెలిపారు.

వచ్చే నెల 8, 9న నిర్వహణ
విజయనగరం దాసన్నపేట, సెప్టెంబరు 8 : జిల్లాలో తొలిసారిగా జాతీయ స్థాయి చదరంగం పోటీలు జరుగనున్నాయి. వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించనున్నట్టు నిర్వాహక కమిటీ చైర్మన్ భీశెట్టిబాబ్జీ తెలిపారు. కొత్త ఆగ్రహారంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదరంగ పోటీల వివరాలను విడుదల చేశారు. గత నెలలో తమిళనాడు రాష్ట్రంలో ప్రపంచస్థాయి చదరంగం పోటీలు అద్భుతంగా జరిగాయన్నారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (పీడే) అనుమతితో ఈ ఏడాది జిల్లాలో పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీఏ రావు మాట్లాడుతూ, జిల్లాలో తమ సంస్థ గతంలో అనేక పోటీలు నిర్వహించిందని, ఉత్తరాంధ్రలోని యువత ఉత్సాహం చూసి తమ సంస్థ కార్యదర్శి, సంఘం రాష్ట్ర కోశాధికారి, ప్రముఖ చెస్ క్రీడాకారుడు కేవీ జ్వాలాముఖి జాతీయ స్థాయి పోటీల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారన్నారు. పోటీలను నగరంలోని రాజీవ్‌గాంధీ క్రీడా కాంప్లెక్స్ ఇండోర్‌లో నిర్వహిస్తామన్నారు. సంస్థ కార్యదర్శి జ్వాలాముఖి మాట్లాడుతూ, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో శ్రమతో కూడుకున్నదని, నగరానికి దేశంలోని ఉన్నతస్థాయి చెస్ క్రీడాకారులు వస్తారని, ప్రభుత్వం.. అధికారులు తగిన సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డీఎస్డీవో అప్పలనాయుడు, గణేష్‌నాయుడు, సైరా బేగం, వరలక్ష్మీ, భాస్కర్, రవిశంకర్, క్రాంతి, ప్రసాద్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.