పేరుకే డిగ్రీ కాలేజీలు

ABN , First Publish Date - 2022-09-09T04:44:40+05:30 IST

జిల్లా కేంద్రం.. అందులోనూ కార్పొరేషన్‌.. అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి దయనీయంగా ఉంది. మూడేళ్లయినా సౌకర్యాలు సమకూరలేదు.

పేరుకే డిగ్రీ కాలేజీలు
డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ఇదే


సౌకర్యాలు, సిబ్బంది నియామకాల్లో దయనీయం
విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో ఇదీ దుస్థితి

జిల్లా కేంద్రం.. అందులోనూ కార్పొరేషన్‌.. అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితి దయనీయంగా ఉంది. మూడేళ్లయినా సౌకర్యాలు సమకూరలేదు. సరిపడా సిబ్బందిని నియమించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా మహారాజా కళాశాల(మాన్సాస్‌)నే ఆశ్రయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం, గజపతినగరం పట్టణాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. కళాశాలల ఏర్పాటు, ప్రారంభం వైసీపీ హయాంలో జరిగింది. అయితే వాటి అభివృద్ధి నిస్తేజంగా మారింది. కళాశాలల్లో మొక్కుబడిగా తరగతులు నిర్వహిస్తున్నారు తప్ప సొంత స్థలం, భవనాలు, బోధనా, బోధనేతర సిబ్బంది నియామకం లేనేలేదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో ఇలాంటి దుస్థితి నెలకొంది.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
విజయనగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేదు. సంస్కృత కళాశాలలోని కొన్ని గదుల్లో నిర్వహిస్తున్న కారణంగా ఒక పూట మాత్రమే నడుస్తోంది. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేదు. వర్షం పడితే కళాశాల ఆవరణ మొత్తం నీటితో నిండిపోతోంది. డిగ్రీ విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. విజయనగరం నడిబొడ్డున రింగు రోడ్డుకు అత్యంత సమీపంలో ఏడు ఎకరాల్లో డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వివిధ సందర్భాల్లో ప్రకటించారు కానీ నేటికీ ఆచరణ లేదు. ఆ స్థలం కాస్తా అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. వేరే చోట స్థలం కేటాయించేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలోనే కొన్ని తరగతి గదులను కేటాయించారు. గజపతినగరం నియోజవర్గ కేంద్రంలో మంజూరైన డిగ్రీ కళాశాల తరగతులను స్థానిక జూనియర్‌ కళాశాల గదుల్లో తాత్కాలికంగా నడుపుతున్నారు. అక్కడ కూడా స్థల సేకరణ చేయడం లేదు. వందలాది ఎకరాలు ఈ మండలంలో అన్యాక్రాంతం అవుతున్నాయి. నియోజకవర్గ కేంద్రంలోనే ప్రభుత్వ చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. డిగ్రీ కళాశాల నిర్మాణానికి మాత్రం స్థలం కొరతని చెబుతున్నారు.

సిబ్బంది కొరత
మూడేళ్ల క్రితమే విజయనగరం, గజపతినగరం పట్టణాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభ మయ్యాయి. మూడేళ్ల చదువు పూర్తిచేసుకుని ఒక బ్యాచ్‌ రిలీవ్‌ అయ్యింది. ఇప్పటికీ బోధనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. విజయనగరంలోని సంస్కృత కళాశాలలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలలో 317 మంది విద్యార్థులు చదువుతున్నారు. గణితం, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ జువాలజీ వంటి ప్రధాన సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. దీంతో పలాస, శ్రీకాకుళం, ఎస్‌.కోట, చీపురుపల్లి వంటి కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందిని వారంలో రెండు రోజులు చొప్పున

ఇక్కడికి రప్పిస్తున్నారు.
గజపతినగరం కళాశాలలో సిబ్బంది కొరత మరింత వేధిస్తోంది. విజయనగరం కళాశాలకు వారంలో రెండు రోజులైనా ఇతర కళాశాలల వారు వస్తున్నారు. కాని గజపతినగరం వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో ఆ ప్రాంత విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలల వైపు మక్కువ చూపుతున్నారు. తక్కువ మంది విద్యార్థులతో కాలం నెట్టుకు వస్తున్నారు.

ఏడాది కిందటే మంజూరైనా
శ్రీకాకుళం జిల్లాలో ఏడాది క్రితం మంజూరైన డిగ్రీ కళాశాలలకు సైతం అక్కడి మంత్రులు, స్పీకర్‌ చొరవ తీసుకుని పూర్తి స్థాయి బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకున్నారు. భవన నిర్మాణాలకు సైతం నిధులు మంజూరు చేయించుకున్నారు. ఒక నియోజకవర్గంలో మూడు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మూడు కళాశాలలున్నాయి. ఆమదాలవలస నియోజవర్గంలో మూడు కళాశాలున్నాయి. ఇటీవల మంజూరైన పొందూరు, తొగరాం, ఆమదాలవలస డిగ్రీ కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకున్నారు. మన జిల్లాలో విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నా నేటికీ పోస్టుల మంజూరు ఆదేశాలు కూడా తీసుకురాలేదు. గజపతినగరానికి కూడా బొత్స సోదరుడు అప్పలనరసయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కళాశాల పరిస్థితి యథాతథం.


Updated Date - 2022-09-09T04:44:40+05:30 IST