ఉధృతంగా నదులు

ABN , First Publish Date - 2022-08-16T05:17:18+05:30 IST

ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాగావళి, వంశధారకు వరద పోటెత్తుతోంది.

ఉధృతంగా నదులు
గురుగుబిల్లి: తోటపల్లి స్పిల్‌వే 8 గేట్లు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

నాగావళి, వంశధారకు పోటెత్తుతున్న వరద

ముంపులో తీర ప్రాంతాలు

నీట మునిగిన పంటలు 

 గరుగుబిల్లి/భామిని: ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  నాగావళి, వంశధారకు వరద పోటెత్తుతోంది. దీంతో నదీతీర ప్రాంతాలు, పంటలు ముంపునకు గురవుతున్నాయి. గురుగుబిల్లి మండలం  తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి సోమవారం  ఉదయం 5 గంటల సమయంలో 31,017 క్యూసెక్కులు రాగా, దిగువ ప్రాంతాలకు 35,419 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు. 9 గంటల సమయానికి 36,400 క్యూసెక్కులు రాగా, నదిలోకి 28,989 క్యూసెక్కులను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి 27,225 క్యూసెక్కుల నీరు రాగా స్పిల్‌వేకు చెందిన 8 గేట్లు నుంచి 39 వేల క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 103.70 మీటర్ల నీరు నిల్వ సామర్థ్యాన్ని ఉంచారు.  కుడి, ఎడమ ప్రధాన కాలువల నుంచి 1300 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా వరద ఉధృతికి   నదికి  ఇరువైపులా ఉన్న ఒడ్డులు కోతలకు గురవుతున్నాయి.  దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కుడి ప్రాంతం వైపు నివాస గృహాలు,  ప్రాజెక్టుకు చెందిన విశ్రాంత గృహం, పార్వతీపురం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే ప్రధాన పంపు హౌస్‌ ఉంది. వరద పోటుతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అఽధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా  సాయంత్రం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ శంబంగి సుగుణాకరరావు పరిశీలించారు. ఒడిశా నుంచి  వరద సమాచారాన్ని  తెలుసుకుని, ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లించాలని సిబ్బందికి సూచించారు.  నదీ తీర ప్రాంతాల్లో తహసీల్దార్‌ అజూ రఫీజాన్‌  పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.  తీరం పైపు వెళ్లరాదని దండోరా వేయించారు. గ్రామాల్లో వీఆర్‌వోలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  భామిని మండలంలోని వంశధారలో ఆదివారం అర్ధరాత్రి భారీగా వరదనీరు చేరింది. దీంతో నదీతీర ప్రాంతాలైన కీసర, కోసలి, సొలికిరి, సింగిడి, బిల్లుమడలో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.  కీసర, కోసలి జంట గ్రామాల్లో  సుమారు 500 ఎకరాల్లో  వరి, అరటి, కూరగాయలు తదితర పంటలు నీటమునిగాయి. సొలికిరలో 150 ఎకరాల్లో వరి, బిల్లుమడ, సింగిడిలో పత్తి, మొక్కజొన్న పంటలు ముంపులో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.   ఏటా  ఇదే సమస్యతో తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు  డిమాండ్‌ చేస్తున్నారు.  కీసర, కోసలి నదీతీరంలో కరకట్టలు నిర్మించాలని రైతులు పోలాకి రాంబాబు, కె.రమణయ్య, నారాయణరావు, లక్షుమయ్య, సామాజిక కార్యకర్త పడాల భూదేవి తదితరులు కోరుతున్నారు. 

  

 

Read more