ఎమ్మెల్యేలు ఫోన్‌ ఎత్తడం లేదు

ABN , First Publish Date - 2022-12-12T00:35:11+05:30 IST

‘జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యకర్తల ఫోన్‌లు ఎత్తడం లేదు. ఆ విధంగా చేస్తే, పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పాను. వారిద్దరూ మారాలి’ అంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణ పార్టీ సమావేశంలో ప్రస్తావించారు.

ఎమ్మెల్యేలు ఫోన్‌ ఎత్తడం లేదు

వారు మారాలి

వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స

(విజయనగరం- దాసన్నపేట)

‘జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యకర్తల ఫోన్‌లు ఎత్తడం లేదు. ఆ విధంగా చేస్తే, పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పాను. వారిద్దరూ మారాలి’ అంటూ మంత్రి బొత్స సత్యన్నారాయణ పార్టీ సమావేశంలో ప్రస్తావించారు. వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పూల్‌బాగ్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి అతిథులుగా మంత్రి బొత్సతో పాటు టీటీడీ చైర్మన్‌, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. తొలుత ఈ మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకరువు పెట్టారు. ప్రసంగాలు సాదాసీదాగా సాగడంతో వేదికపై వున్నవారితో పాటు దిగువన ఉన్నవారిలో నిరుత్సాహం కనిపించింది. పనులు చేసినా, బిల్లులు చెల్లించడం లేదని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని, సంక్రాంతి నాటికి బిల్లులు చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ, పార్టీ కోసం అహోరాత్రులూ కష్టించి పనిచేసే కొంత మంది నాయకులు, కార్యకర్తలు పదవులు రాలేదని నిరుత్సాహంతో వున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

Updated Date - 2022-12-12T00:35:11+05:30 IST

Read more