Medical Shop Owner: ఈ మెడికల్ షాప్ ఓనర్ ఏంటి.. పాపం ఇంతపని చేశాడు..

ABN , First Publish Date - 2022-08-24T02:12:48+05:30 IST

పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డు ఓ హాస్పిటల్‌లో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వారం కిందట పరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. విశాఖకు చెందిన వైద్యుడి ఆధ్వర్యంలో..

Medical Shop Owner: ఈ మెడికల్ షాప్ ఓనర్ ఏంటి.. పాపం ఇంతపని చేశాడు..

మెడికల్‌ షాపు నిర్వాహకుడు పరారీ

అప్పులు బాధ భరించలేకే


రాజాం రూరల్‌: పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డు ఓ హాస్పిటల్‌లో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వారం కిందట పరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. విశాఖకు చెందిన వైద్యుడి ఆధ్వర్యంలో రాజాంలో నిర్వహిస్తున్న ఆ హాస్పిటల్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తూ దొరికిన చోటల్లా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. పట్టణంలో తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేయడం, ప్రైవేటు ఫైనాన్స్‌ల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవడంతో అప్పులు పెరిగి పోయినట్లు పలువురు చెబుతున్నారు. ఈనేపథ్యంలో అప్పుతీసుకున్న వారి ఒత్తిడి నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఇదే రోడ్డులో నివాసముంటున్న ఆయన వారంరోజుల కిందట తన భార్య, తల్లి, ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి తాళం వేసి ప్రయాణం వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రతి గురువారం విశాఖ నుంచి న్యూరాలజిస్ట్‌ రాజాం వచ్చి పేషెంట్లను వైద్యసేవ లందిస్తుంటారు.



ఈ నెల 18న ఆయన రాజాం వచ్చిన సమయంలో మెడికల్‌ షాపు నిర్వాహకుడు లేకపోవడంతోపాటు సెల్‌ఫోన్‌కు కాల్‌చేస్తే స్విచ్ఛాప్‌ వస్తోందని పలువురు చెబుతున్నారు. వారం రోజులుగా ఇంటికి తాళం వేసి ఉందని తెలియడం తో స్థానికుల్లో అనుమానం బలపడింది. కాగా తన ఇంటిపై బ్యాంకు నుంచి అప్పు తీసుకునేందుకు రెండు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులతో దూరంగా వెళ్లారని కూడా కొంతమంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా  విశాఖలో ఉన్న ఓ ప్రముఖ వైద్యుడు కూడా మెడి కల్‌ షాపు నిర్వాహకుడు పరారయ్యారన్న అనుమానాన్ని ఆంధ్రజ్యోతితో వ్యక్తం చేశారు. కాగా పరారయ్యారని ప్రచారం సాగుతున్న మెడికల్‌ షాపు నిర్వాహకుడిపై ఇప్పటివరకూ ఎవరూ రాజాం పొలీసులను ఆశ్రయించలేదు.

Updated Date - 2022-08-24T02:12:48+05:30 IST