మూగజీవాలకు ముప్పు!

ABN , First Publish Date - 2022-09-07T04:06:18+05:30 IST

ల్లాలో లంపిస్కిన్‌ వ్యాధి కలకలం రేపుతోంది. ఎల్‌.కోట మండలం గేదెలవానిపాలెం, నిడిగట్టు, ఎస్‌.కోట మండలం సిరుసువానిపాలెం, కొత్తవలస మండలం రెల్లి, ముమ్మునివానిపాలెం, జామి మండలం అలమండలో పదుల సంఖ్యలో పశువులకువ్యాధి సోకింది. ఈ వ్యాధిని.. కాప్రిపాక్స్‌ వైరస్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఒకే సమయంలో ఆవు, గేదెలు వంటి అనేక పశువుల

మూగజీవాలకు ముప్పు!
లంపిస్కిన్‌ వైరస్‌ సోకిన పశువు

- జిల్లాలో వెలుగుచూసిన లంపిస్కిన్‌ 

- ఎస్‌.కోట నియోజకవర్గంలో పశువులకు వ్యాధి

- అప్రమత్తమైన అధికారులు 

- బాధిత గ్రామాల్లో ముమ్మరంగా టీకాలు

- అంతర్‌ జిల్లా, రాష్ట్ర రహదారుల్లో చెక్‌పోస్టులు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి/లక్కవరపుకోట) 

మూగజీవాలపై సరికొత్త వైరస్‌ పంజా విసిరింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వందలాది పశువుల మృత్యువాతకు కారణమైన లంపిస్కిన్‌ వ్యాధి.. జిల్లాకూ వ్యాపించింది. ఎస్‌.కోట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పశువులకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నివారణ కోసం పశువులకు ముమ్మరంగా టీకాలు వేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మూగజీవాల రవాణా కట్టడి చేస్తున్నారు. అత్యవసర సేవల కోసం కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. 

జిల్లాలో లంపిస్కిన్‌ వ్యాధి కలకలం రేపుతోంది. ఎల్‌.కోట మండలం గేదెలవానిపాలెం, నిడిగట్టు, ఎస్‌.కోట మండలం సిరుసువానిపాలెం, కొత్తవలస మండలం రెల్లి, ముమ్మునివానిపాలెం, జామి మండలం అలమండలో పదుల సంఖ్యలో పశువులకువ్యాధి సోకింది. ఈ వ్యాధిని.. కాప్రిపాక్స్‌ వైరస్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఒకే సమయంలో ఆవు, గేదెలు వంటి అనేక పశువులకు వేగంగా సోకడం దీని ప్రత్యేకత అని చెబుతున్నారు. 2019లో తొలిసారిగా దీని మూలాలు ఒడిశాలోని మయూరాభంజ్‌, భద్రక్‌ జిల్లాలో బయటపడ్డాయి. తర్వాత ఉత్తరాది రాష్ట్రాలను ఈ వ్యాధి చుట్టేసింది. గుజరాత్‌, రాజస్థాన్‌, జమ్మూకశ్మీరు, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఈ వ్యాధి బారిన పడి వందలాది పశువులు మృతి చెందాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. విస్తృతంగా టీకాలు వేయడంతో వ్యాధి తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈ ఏడాది మే నెల నుంచి మరోసారి దేశవ్యాప్తంగా వ్యాధి విజృంభించింది. తాజాగా ఎస్‌.కోట నియోజకవర్గంలో ఈ వ్యాధి లక్షణాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖతో పాటు పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మార్కెటింగ్‌, రవాణా  శాఖలు అప్రమత్తమయ్యాయి. బాధిత గ్రామాలను పశువులను అధికారులు దిగ్బంధించారు. ఈ గ్రామాలతో పాటు జిల్లావ్యాప్తంగా పశువులకు టీకాలు వేయాలని పశుసంవర్థక శాఖ అధికారులు ఆదేశించారు. జిల్లాల సరిహద్దులతో పాటు ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. పశువుల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. జిల్లాలో దత్తిరాజేరు మండలం మానాపురం, జామి మండలం అలమండ, రాజాంలో జరిగే సంతలతో పాటు అటు పార్వతీపురం,  పాలకొండ మండలం నవగాం వద్ద జరిగే వారపు సంతల్లో రైతులకు, క్రయవిక్రయదారులకు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా దండోరా వేయిస్తున్నారు. ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సచివాలయ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

వ్యాధి లక్షణాలివి

కందిరీగలు, జోరీగ, రక్తం పీల్చే దోమలు ద్వారా పశువులకు లంపిస్కిన్‌ వ్యాధి వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత, ఎండ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. శీతాకాలంలో క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులకు విపరీతంగా జ్వరం వస్తుంది. కళ్ల నుంచి నీరు, ముక్కు నుంచి స్రావాలు, చొంగలు కారుతాయి. ప్రధానంగా మెడ, పక్కటెముకలు, కాళ్లు, వెన్నెముక ఇరు ప్రాంతాలు, పొదుగుపై, శరీరమంతా కడతలు, బొప్పెలు పుడతాయి. నొప్పి కారణంగా ఆవులు, గేదెలు పాల ఉత్పత్తిని ఒక్కసారిగా తగ్గించేస్తాయి. దుక్కిటెద్దు, పడ్డల్లో కడతలు లేకుండా వ్యాధి సోకే అవకాశముంది. లింఫ్‌ గ్రంధి వాపు, కాలువాపు, గంగడోలు వాపు, కీళ్ల మధ్య వాపు, చర్మం సంచివలే మారడం, గిట్టలపై వాపు రావడం ఈ వ్యాధి లక్షణాలు. సకాలంలో వైద్యసేవలు, టీకాలు అందించకపోతే చర్మం ఊడిపోతుంది. కడతలు గాయాలుగా మారుతాయి. వాపులు ముదిరి పుండ్లు అవుతాయి. పశువులు పక్షవాతానికి గురై నడవడానికి కూడా ఇబ్బంది పడతాయి. తక్షణ వైద్యసేవలు అందకపోతే చూడి ఆవులు, గేదెలకు గర్భస్రావమవుతుంది. కడుపులోనే దూడ మరణిస్తుంది. తల్లి పశువుకు ప్రాణాపాయం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు యాంటీ బయోటిక్స్‌, యాంటీ హీస్టమిన్‌ మందులను వినియోగించాలని చెబుతున్నారు. తిప్పతీగ, నేలవేము వంటి హోమియో వైద్యం అందించినా పశువులు వేగంగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. 

నివారణకు చర్యలు 

జిల్లాలో ఎస్‌.కోట నియోజకవర్గంలో పశువులకు లంపిస్కిన్‌ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అందుకే రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించాం. ముమ్మరంగా టీకాలు వేసి.. వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే రెండు జిల్లాల కోసం 90 వేల డోసులు తెప్పించాం. అంతర్‌ జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. గ్రామాలు, వారపు సంతల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.  

- వైవీ రమణ, పశుసంవర్థక శాఖ జేడీ, విజయనగరం






Updated Date - 2022-09-07T04:06:18+05:30 IST