పండగ నెలలోనూ జాప్యమేనా?

ABN , First Publish Date - 2022-10-04T05:07:13+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే ఠంచన్‌గా జీతాలు చెల్లిస్తున్నామని సర్కారు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతినెలా వేతనాల చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది.

పండగ నెలలోనూ జాప్యమేనా?

  జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇంకా అందని జీతాలు

  ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికీ చెల్లించని వైనం

   పింఛన్ల కోసం ప్రభుత్వ పింఛన్‌దారుల ఎదురుచూపు

   సర్కారు తీరుపై విమర్శల వెల్లువ 

(పార్వతీపురం ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే ఠంచన్‌గా జీతాలు చెల్లిస్తున్నామని సర్కారు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతినెలా వేతనాల చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. జీతం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది. అసలే ఇది పండగ నెల. ఈ నెలైనా సమయానికి జీతం పడుతుందని ఆశించిన వారికి     నిరాశే ఎదురైంది. ఇప్పటివరకూ జిల్లాలో ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు అందలేదు.  ప్రభుత్వ పింఛన్‌దారులకు కూడా పింఛన్‌ చెల్లించలేదు. దీంతో పండగ పూట పస్తులుండాల్సిందేనా? అంటూ ఆయా వర్గాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదని, పండగ ఎలా జరుపుకోవాలని మండిపడుతున్నాయి.  

ఇదీ పరిస్థితి.. 

వాస్తవంగా ఉద్యోగులకు జీతమే ఆధారం. దాని ఆధారంగా ఓ బడ్జెట్‌ రూపొందించుకుని ఖర్చులు పెడుతుంటారు. అయితే    ప్రతినెలా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో జిల్లాలో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.  పండగ నెలలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో వారు పెదవి విరుస్తున్నారు.  ఇప్పటివరకూ రెవెన్యూ, పోలీసుశాఖ, వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ నెల ఒకటో తేదీన వేతనాలు జమయ్యాయి. జిల్లాలో 4,210 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు  ఉండగా,  వీరఘట్టం మండలం మినహా మిగిలిన  చోట్ల టీచర్లకు వేతనాలు అందలేదు.  అనేక ప్రభుత్వ శాఖల ఉద్యోగులకూ ఈ నెల 3వ తేదీ నాటికి జీతాలు జమ కాలేదు. ప్రస్తుతం  తమ బ్యాంకుల ద్వారా వచ్చే మెసేజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సుమారు 3500 మంది ఉన్నారు. అయితే  వివిధ ప్రభుత్వ, ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సీఆర్‌టీలు, కొన్ని శాఖల్లో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లకు వేతనాలు ఇంకా చెల్లించలేదు.  జిల్లాలో ప్రభుత్వ పెన్షనర్లు సుమారు 6000 మంది ఉండగా వారికీ ఇంతవరకూ పింఛన్లు చెల్లించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఏ నెల ఆలస్యమైనా కాస్త సర్దుకుపోవచ్చు కానీ పండగ వేళ అందకపోతే ఎలా? అని  అనేకమంది పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఎప్పుడు పడతాయా? అని పండగ పూట కూడా ఎదురుచూడాల్సిందేనా ? అంటూ  మండిపడుతున్నారు. దసరా  నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీకి ప్రభుత్వం జీతాలు జమ చేయకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి పండగ చేసుకోవాలా? అని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

  సాంకేతిక లోపాలే కారణం

 సాంకేతిక లోపాల వల్ల ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కాకపోవచ్చు.  ప్రతి నెలా  నిర్ణీత సమయంలోనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. ఎవరైనా నా దృష్టికి సమస్యలు తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను.

- బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం Read more