పుస్తకం అంతేనా?

ABN , First Publish Date - 2022-06-11T05:52:03+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల సమస్య ప్రతి ఏటా వెం టాడుతూ వస్తోంది. గడచిన విద్యా సంవత్సరంలో సకాలంలో అందలేదు.

పుస్తకం అంతేనా?

పాఠ్య పుస్తకాలు వచ్చేదెప్పుడు?

నేటికీ అరకొరగానే పంపిణీ

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల సమస్య ప్రతి ఏటా వెం టాడుతూ వస్తోంది. గడచిన విద్యా సంవత్సరంలో సకాలంలో అందలేదు. చాలా రోజులు పుస్తకాలు లేకుండానే విద్యార్థులు చదువులకు పరిమితమైన పరిస్థితి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం రోజునే జగనన్న విద్యా కానుక కిట్లలో పాఠ్య పుస్తకాలను పెట్టి అందిస్తామని చెప్పినప్పటికీ గతేడాది ఆచరణలో సాధ్యం కాలేదు. పాఠశాలలు ప్రారంభమైన మూడు నెలలకు కూడా పూర్తిస్థాయిలో పంపిణీకి నోచుకోలేదు. చాలామంది మధ్య తరగతి కుటుంబా లకు చెందిన విద్యార్థులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు పుస్తకాలను కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది ఇందుకు భిన్నంగా కార్యాచరణ ఉంటుం దని అనుకుంటే ఆ పరిస్థితి లేదు. ఈసారి ప్రభుత్వ విద్యార్థులకే కాకుండా ప్రైవే టు పాఠశాలలకు కూడా ప్రభుత్వమే ముద్రించి పంపుతుందని చెప్పి ఇండెంట్ల ను జిల్లాల నుంచి సేకరించారు. ఆంగ్ల మాధ్యమంలో సందేహాలు వస్తే వెంటనే దాన్ని విద్యార్థి నివృత్తి చేసుకోవడానికి సమాంతరంగా తెలుగు మీడియంలో కూడా ముద్రించి ఒకే పుస్తకంలో లభ్యమయ్యేలా చూస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగు మాధ్యమం విద్యార్థులకు సంబంధించి అన్ని తరగతుల పుస్తకాలు చాలావరకు ముద్రణ కాలేదని సమాచారం.

సాలూరు మండలంలో 1,27,334 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 75,344 పుస్తకాలు వచ్చాయి. సీతానగరం మండలానికి 48,262 పుస్తకా లు అవసరం కాగా కేవలం 15,060 మాత్రమే వచ్చాయి. పార్వతీపురం మండ లంలో 1,12,940 పుస్తకాలు అవసరం కాగా 35,135 పుస్తకాలు వచ్చాయి. పాచిపెంట మండలంలో 8,06,048 పుస్తకాలకు గాను 31,802 మాత్రమే వచ్చాయి. కురుపాం మండలంలో 88,916 పుస్తకాలు అవసరం కాగా 38,894 మాత్రమే వచ్చాయి. కొమరాడ మండలంలో 69,155 పుస్తకాలు అవసరం కాగా 26,922 మాత్రమే వచ్చాయి. జియ్యమ్మవలస మండలంలో 61,054 పుస్తకాలకు గాను 24,602 మాత్రమే వచ్చాయి. గుమ్మలక్ష్మీపురం మండలం లో 97,570 పుస్తకాలు అవసరం కాగా 39,847 మాత్రమే వచ్చాయి. గరుగు బిల్లి మండలంలో 50,038 పుస్తకాలు అవసరం కాగా 15,142 మాత్రమే వచ్చాయి. బలిజిపేట మండలంలో 49,858 పుస్తకాలకు గాను 18,714 మాత్రమే వచ్చాయి. ఇదే పరిస్థితి పాలకొండ నియోజకవర్గం పరిధిలో గల సీతంపేట, పాలకొండ, వీరఘట్టాం, భామిని మండలాల్లో కూడా ఉంది. ముందస్తుగా పాఠ్య పుస్తకాలు రాకపోతే గతేడాది మాదిరి విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు.


పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు వస్తాయి

పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు జిల్లాకు వస్తాయి. ఉమ్మడి జిల్లాలతో ముడిపడి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాకు పాఠ్య పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి. లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలతో పాటు ప్రభుత్వం నుంచి ప్రతీ సహకారాన్ని అందిస్తూ విద్యాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.

-బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి

Updated Date - 2022-06-11T05:52:03+05:30 IST