ఇలా అయితే.. భోజనం పెట్టలేం!

ABN , First Publish Date - 2022-07-04T05:22:16+05:30 IST

‘నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. కొవిడ్‌ తరువాత శతశాతం పెరిగాయి. అయినా పాత ధరలతో బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలాగైతే పౌష్టికాహారం అందించలేం. ఇది సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం పునరాలోచించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ రేట్లను పెంచాలి’.. అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు.

ఇలా అయితే.. భోజనం పెట్టలేం!
అంగన్‌వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులు భోజనం చేస్తున్న దృశ్యం

కొత్త మెనూకు పాత బిల్లులా?

ధర పెంచితేనే పథకం అమలుచేయగలం

అంగన్‌వాడీల పెదవివిరుపు

(పార్వతీపురం రూరల్‌)

‘నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. కొవిడ్‌ తరువాత శతశాతం పెరిగాయి. అయినా పాత ధరలతో బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలాగైతే పౌష్టికాహారం అందించలేం. ఇది సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం పునరాలోచించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ రేట్లను పెంచాలి’.. అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం తమకు భారంగా పరిగణిస్తున్నారు. ఎలాగోలా కేంద్రాలను నెట్టుకొస్తున్న తమపై భారం మోపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పౌష్టికాహారం కిట్లను చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించేవారు. ఇప్పుడు కేంద్రం వద్ద వండి వేడివేడిగా అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో వసతులు మెరుగుపరచకుండా ప్రభుత్వ ఆదరాబాదరాగా వంట చేయాలని ఆదేశాలిచ్చింది. గ్యాస్‌ స్టవ్‌లు, కుక్కర్లు, వంట పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు లేకుండా ఎలా అని అంగన్‌వాడీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి కోడి గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పులను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఆకుకూరలు, కాయగూరలతో పాటు చింతపండు, ఉప్పు, కారం, మసాల దినుసులు వంటి వాటిని సిబ్బందే స్థానికంగా కొనుగోలు చేయాలి. పోపు సామగ్రి కోసం ఒక్కొక్కరికి రూ. 1.40 పైసలు మాత్రమే చెల్లిస్తుంది. గ్యాస్‌ కోసం ఒక్కొక్కరికి రూ.50 పైసలు ఇస్తుంది. ఈ చార్జీలు ఏ మాత్రం సరిపోవని సిబ్బంది చెబుతున్నారు. వీటి ధరలను పెంచాలని కొంతకాలంగా కోరుతూ వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత రెండేళ్ల కిందట ధరలతో పోల్చుకుంటే గ్యాస్‌ నాలుగు రెట్లు అయ్యింది. మిగతా నిత్యావసరాల గురించి చెప్పనక్కర్లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పాత ధరలకే వంట చేయాలని చెబుతుండడంపై అంగన్‌వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 ఇదీ పరిస్థితి

జిల్లా వ్యాప్తంగా 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,064 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7,335 మంది గర్భిణులు,  8,266 మంది బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 35,247 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 28,310 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కొత్త మెనూ ప్రకారం చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు ఇక నుంచి కేంద్రాల్లోనే మధ్యాహ్నం వేడి వేడిగా ఆహారం వడ్డించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌, అన్నం, కోడి గుడ్డు కూర, కూరగాయ కూర, సాంబారు, టమాటా పప్పు, ఆకు కూర పప్పు, బీరకాయ, సొరకాయ వంటివి మెనూలో చేర్చారు. ఏ రోజు ఏం పెట్టాలన్న దానిపై కూడా స్పష్టత నిచ్చారు. గతంలో ఆకు కూరలు, కాయగూరలతో భోజనానికి అవస్థలు పడ్డారు. ఇప్పుడు కొత్త మెనూ ప్రకారం పెట్టాలంటే కత్తిమీద సాముగా పేర్కొంటున్నారు. 

  మెనూ పాటించాల్సిందే...

కొత్త మెనూ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలి. నిబంధనలు పక్కాగా పాటించాలి. ఎక్కడా లోపం ఉండకూడదు. ఫిర్యాదులు రాకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మెనూకు సంబంధించి చెల్లింపుల విషయం ప్రభుత్వం పరిధిలో ఉంది.  కేంద్రాల్లో సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరిస్తాం. 

- జి.వరహాలు, ఐసీడీఎస్‌ పీడీ, పార్వతీపురం 


 

Updated Date - 2022-07-04T05:22:16+05:30 IST