శభాష్‌.. సోమన్న!

ABN , First Publish Date - 2022-06-12T06:08:21+05:30 IST

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడ లేదు. స్వగ్రామానికి తనవంతుగా ఏదో చేయాలని తలచాడు. పోడు వ్యవసాయం ద్వారా సంపాదించిన మొత్తంతో గ్రామానికి రహదారి వేశాడు. తాగునీటి సౌకర్యం కల్పించాడు.

శభాష్‌.. సోమన్న!
రూ.2 లక్షలతో ఏర్పాటు చేసుకున్న రహదారి

     రూ.2 లక్షలతో గ్రామానికి రహదారి నిర్మాణం

   రూ.50 వేలతో తాగునీటి వసతి కల్పన 

   ఆదర్శంగా నిలిచిన గిరిజనుడు

(సీతంపేట) 


ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడ లేదు. స్వగ్రామానికి తనవంతుగా ఏదో చేయాలని తలచాడు. పోడు వ్యవసాయం ద్వారా సంపాదించిన మొత్తంతో గ్రామానికి రహదారి వేశాడు. తాగునీటి సౌకర్యం కల్పించాడు. మొత్తంగా అధికారులకు కనువిప్పు కలిగించాడు. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరాకు కూడా సహకారం అందిస్తానని చెబుతున్న గిరిజనుడు సవర సోమన్న ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు  కేటాయిస్తున్నప్పటికీ.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రధానంగా  సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు కాకపోవడంతో గిరిజనులు కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. ఇందుకు నిదర్శనమే సీతంపేట మండలం మర్రిపాడు పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామం ఎగువ సంకిలిగూడ. ఐటీడీఏకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో  ఇక్కడ ఐదు కుటుంబాలు జీవిస్తుంటాయి. దీనికి అనుకొని మరో నాలుగు గ్రామాలు ఉన్నాయి. అయితే ఎగువ సంకిలిగూడ వాసులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. తమ ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించాలని వారు పలుమార్లు ఐటీడీఏ అధికారులను కోరారు. దీర్ఘకాలికంగా ఎదురుచూసినా చర్యలు శూన్యం.  దీంతో అదే గ్రామానికి చెందిన సవర సోమన్న గ్రామాభివృద్ధికి నడుం బిగించాడు.  పోడు వ్యవసాయం ద్వారా తాను సంపాదించిన రూ.2 లక్షలతో  రహదారి నిర్మించాడు. రూ.50 వేలతో గ్రావిటేషన్‌ పైపు ఏర్పాటు చేసుకొని తాగునీటి సౌకర్యం కల్పించాడు.  వాస్తవంగా దిగువ సంకిలి నుంచి రంగమ్మవలస గ్రామానికి ఆరు కిలోమీటర్లు మేర ఐటీడీఏ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో 2018లో ఫార్మేషన్‌ రహదారి సౌకర్యం కల్పించారు.  అయితే 2019-2020లో ఆ రహదారి నుంచి తన గ్రామానికి రోడ్డు వేసుకున్నట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు. రాత్రి వేళల్లో అడవి జంతువులు, విష సర్పాలతో  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తోందని వాపోయాడు.   దీనిపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు.  విద్యుత్‌ సౌకర్యం కోసం అవసరమైతే తాను డబ్బులు సమకూరుస్తానని చెబుతూ.. తన ఔదార్యాన్ని చాటాడు. ఐటీడీఏ అధికారులు స్పందించి  కనీసం సోలార్‌ లైట్‌ అయినా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.   ఐటీడీఏకు ఆ గ్రామం నుంచి ఎటువంటి వినతులు రాలేదని, ఒక వేళ వస్తే పరిశీలించి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఐటిడిఏ ఏపీవో వరలక్ష్మి తెలిపారు. ఐటీడీఏ అధికారులు అనుమతి ఇస్తే ఆ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ట్రాన్స్‌కో సబ్‌ ఇంజనీర్‌ అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు.

 


Read more