అపార నష్టం

ABN , First Publish Date - 2022-09-11T05:30:00+05:30 IST

గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి పొలాలు నీట మునిగాయి. రాజాం, బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో వరద ముప్పు తీవ్రంగా ఉంది. వందలాది ఎకరాల్లో వరి పొలాలు ముంపుబారిన పడ్డాయి

అపార నష్టం
కొండచాకరాపల్లిలో చెరువును తలపిస్తున్న పంట పొలాలు

చెరువులను తలపిస్తున్న పొలాలు
ఇంకా ముంపుబారిలోనే
ఆందోళనలో రైతులు
విజయనగరం (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 11:
గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి పొలాలు నీట మునిగాయి. రాజాం, బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో వరద ముప్పు తీవ్రంగా ఉంది. వందలాది ఎకరాల్లో వరి పొలాలు ముంపుబారిన పడ్డాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు మెట్ట ప్రాంతాల్లో సైతం ఉబాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు లేక చాలచోట్ల ఉబాలు వేయలేదు. ఇప్పుడు వర్షాలు పడడంతో నాట్లు వేస్తున్నారు.  డెంకాడ, భోగాపురం, గజపతినగరం, దత్తిరాజేరు, చీపురుపల్లి, ఎల్‌.కోట, బొబ్బిలి, బాడంగి, తెర్లాం తదితర మండలాల్లో రైతులు వరినాట్లు వేస్తున్నారు.

జల దిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు..
 రేగిడి మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నాగావళి నది పొంగి ప్రవహిస్తోంది. ఆకులోవకట్టగెడ్డ పొంగి ప్రవహించడంతో రేగిడిలోని ప్రభుత్వ కార్యాలయాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ భవనం, అంగన్‌వాడీ భవనాలు, సచివాలయ భవనాల్లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది. రేగిడిగెడ్డ పొంగి రహదారిపై పారుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కార్యాలయాల్లో విలువైన రికార్డులు తడిచిపోయే ప్రమాదముందని సిబ్బంది చెబుతున్నారు. అటు నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరి పొలాలు, చెరకు తోటల్లోకి భారీగా వరద నీరు చేరింది. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. తహసీల్దారు కళ్యాణ చక్రవర్తి అప్రమత్తమయ్యారు. వీఆర్వోలతో పాటు రెవెన్యూ సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారమందించాలని సూచించారు.

మడ్డువలస పరిసర ప్రాంతాల్లో భయం భయం
వంగర మండలంలో నాగావళి నదితో పాటు వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచాకరాపల్లి, కొప్పర, గీతనాపల్లిలో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో తహసీల్దారు ఐజాక్‌, ఎస్‌ఐ కోటేశ్వరరావు, మడ్డువలస డీఈ నర్మదాపట్నాయక్‌ స్పందించారు. నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతున్నందున పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మడ్డువలస గేట్లు పనిచేయకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎంపీపీ సురేష్‌ ముఖర్జి మడ్డువలస అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్‌ ఎగువ ప్రాంతాలు ముంపునకు గురైతే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొండచాకరాపల్లిలో 500 ఎకరాలు, కొప్పరలో 300 ఎకరాలు, గీతనాపల్లిలో 350 ఎకరాల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.Read more