పంటను తీసుకొచ్చేదెలా?

ABN , First Publish Date - 2022-12-12T00:07:15+05:30 IST

పొలాల మధ్య రహదారి నిర్మించడంతో పంటను కల్లాలకు తీసుకు వెళ్లేందుకు దారి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

పంటను తీసుకొచ్చేదెలా?
పొలాల మధ్య నుంచి నిర్మించిన రహదారి

గంట్యాడ: పొలాల మధ్య రహదారి నిర్మించడంతో పంటను కల్లాలకు తీసుకు వెళ్లేందుకు దారి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గొట్లాం గ్రామం నుంచి చెల్లూరు గ్రామం వరకూ రింగు రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు గుంకలాం, రామవరం, రాకోడు, జొన్నవలస తదితర గ్రామాలకు చెందిన పొలాల మధ్య గుండా వెళ్తోంది. రోడ్డు పనులు కూడా చివరి దశకు వచ్చాయి. ఈ రహదారి నిర్మాణంతో రామవరం పరిధిలోగల పలు పంట పొలాల నుంచి పండిన వరి చేనును కల్లాలకు తీసుకుని రావడానికి రహదారి సదుపాయం లేకపోవడంతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు నిర్మించిన రహదారి పక్కన ఈతలబంద, పాత చెరువు వరి చేను పొలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల పొలం ఉంది. దాదాపు 68 మంది రైతులు ఉన్నారు. గతంలో రోడ్డు లేని సమయంలో ప్రభుత్వ రస్తా ద్వారా పొలల్లో వరి చేనును కల్లాలకు తీసుకొచ్చేవారు. ఇప్పుడు రహదారి నిర్మించడంతో గతంలో ఉన్న రస్తా లేకుండా పోయింది. దీంతో ఆయా పంట పొలాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీంతో జాతీయ రహదారి అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లారు. నిర్మించిన రహదారికి ఆనుకుని ఉన్న చెరువు గట్టును బాగు చేసి, గట్టు మీద నుంచి రహదారి సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేశాం

తమ పొలాల నుంచి వరి చేను తెచ్చుకు నే విధంగా రహదారి కల్పించాలని జాతీయ రహదారి అధికారులకు ఫిర్యాదు చేశాం. రహదారి నిర్మాణం చేయక ముందు పొలాలకు దారి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ పట్టించుకోలేదు. ఇకనైనా అధికారులు స్పందిం చి చెరువు గట్టుపై నుంచి రహదారిని బాగు చేయాలి.

- పల్లి చంద్రరావు, రైతు, రామవరం

పొలాల్లోనే చేను

వరి పంట కోసి నెల రోజులు అయ్యింది. పంటను కల్లాలకు తెచ్చుకోవడానికి రహదారి లేక పొలాల్లోనే చేను ఉండిపోయింది. రహదారి సదుపాయం ఉంటే ఈ వర్షాలు కురవక ముందే తమ పంటను కల్లాలకు తెచ్చుకుని, నూర్పు వేసుకునే వాళ్లం.

- వర్రి లక్ష్మి,

మహిళా రైతు, రామవరం

Updated Date - 2022-12-12T00:07:17+05:30 IST