ఎన్నాళ్లిలా?

ABN , First Publish Date - 2022-07-18T05:32:40+05:30 IST

లక్కవరపుకోట మండలం బీమాళి గ్రామానికి చెందిన ఎం.లక్ష్మి గంట్యాడ మండలంలోని మురపాక గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 60 సెంట్లు భూమిని 2004లో తన తండ్రి వద్ద నుంచి పొందారు.

ఎన్నాళ్లిలా?
స్పందనలో వినతులు స్వీకరిస్తున్న జేసీ మయూర్‌అశోక్‌ (ఫైల్‌)


స్పందనలో ప్రతి సోమవారం అధికంగా రెవెన్యూ సమస్యలపైనే వినతులు
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
కలెక్టరేట్‌, జూలై 17:

 లక్కవరపుకోట మండలం బీమాళి గ్రామానికి చెందిన ఎం.లక్ష్మి గంట్యాడ మండలంలోని మురపాక గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 60 సెంట్లు భూమిని 2004లో తన తండ్రి వద్ద నుంచి పొందారు. ఈ భూమిని ఆమె పేరున ఆన్‌లైన్‌ చేసేందుకు సచివాలయంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ చూపించకపోవడంతో తాము ఏమీ చేయలేమని సచివాలయ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆమె ఏమీ చేయలేక నిరాశతో ఉంది.

 రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన పొదిలాపు సూరప్పడుకు వారసత్వంగా  వచ్చిన భూమిని తన ఆర్థిక అవసరాల కోసం విక్రయించేందుకు వేరే వ్యక్తితో  గత ఏడాది అగ్రిమెంట్‌ చేసుకున్నారు.  రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే సర్వే నెంబరు 196-16లో ఉన్న 64 సెంట్లు నిషేధిత భూముల జాబితా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఆ రైతు కలెక్టరేట్‌ స్పందనలో విన్నవించుకున్నారు. నెలలుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ఈ రెండు సమస్యలే కాదు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌ స్పందనలో రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా వినతులు వస్తున్నాయి. రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు.  భూముల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడం.. భూముల ఆక్రమణలు.. మ్యుటేషన్‌ కాకపోవడం.. అడంగల్‌ కర్షన్‌.. తదితర సమస్యలపైనే ఎక్కువ విన్నపాలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని రకాల వినతులు కలిపి 12,954  రాగా ఇందులో రెవెన్యూ శాఖవే 3085 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో చాలా వినతులు  పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు.
ప్రధానంగా మ్యుటేషన్‌ ప్రక్రియ మీసేవ కేంద్రాల్లో నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.  సచివాలయాల్లో మ్యుటేషన్‌ చేసుకునే అవకాశం ఉన్నా అక్కడి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు వద్ద ప్రస్తావించగా రెవెన్యూ శాఖ నుంచి వస్తున్న వినతులను పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు.

స్పందనలో వచ్చిన వినతులు(నెల రోజుల్లో)

  తేదీ     మొత్తం     రెవెన్యూవి
జూన్‌ 13    226       187
జూన్‌ 20     180      150
జూన్‌ 27      211     190
జూలై 4       218     194
జూలై 11       220    166


Read more