బాలికలూ.. భళా

ABN , First Publish Date - 2022-10-01T05:06:50+05:30 IST

తాటిపూడి గురుకుల పాఠశాల విద్యార్థినులు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలో అద్భుతమైన ప్రతిభ చూపారు. విద్యాలయ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేశారు.

బాలికలూ.. భళా
తాటిపూడి గురుకుల పాఠశాల


సత్తా చాటిన తాటిపూడి గురుకుల విద్యార్థినులు

ట్రీపుల్‌ ఐటీలో ఏకంగా 27 సీట్లు కైవసం

విద్యాలయానికి ప్రశంసల జల్లులు


శృంగవరపుకోట రూరల్‌, సెప్టెంబరు 30 : తాటిపూడి గురుకుల పాఠశాల విద్యార్థినులు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలో అద్భుతమైన ప్రతిభ చూపారు. విద్యాలయ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేశారు. ఏకంగా 27 మంది సీట్లు సాధించారు. ఈ విద్యాలయంలో గత ఏడాది పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే సమయంలో  52మంది విద్యార్థులు 550మార్కులు దాటి సాధించారు. రాష్ట్రస్థాయిలో అత్యధిక సగటు మార్కులు పొందిన ఏడు పాఠశాలల్లో తాటిపూడి గురుకులం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకు గాను సీఎం చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు పొందారు. ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేసిన ఫలితమే ఇదని ప్రిన్సిపాల్‌ చెబుతున్నారు. నూజివీడు ట్రీపుల్‌ఐటీలో 16, శ్రీకాకుళం క్యాంపస్‌లో 10, ఇడుపులపాయ ట్రీపుల్‌ఐటీలో ఒక సీటు సాధించారు. ఈ ఫలితాలతో ఇక్కడి ఉపాధ్యాయులకు రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. 

ప్రత్యేక శిక్షణ ఇచ్చాం

మా పాఠశాల నుంచి 27మంది విద్యార్థులు ట్రీపుల్‌ఐటీకి ఎంపిక కావడానికి ఉపాధ్యాయులు అందించిన ప్రత్యేక శిక్షణ దోహదపడింది. పాఠశాలలో బాగా చదివే 40మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మేథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌ పాఠ్యంశాల్లో ఉన్నవాటికంటే అదనపు అంశాలను బోధించాం. వారికోసం స్టడీ మెటీరియల్‌ తయారుచేసి అందించాం. ఎక్కువ రోజులు సాధన చేయించాం. 27సీట్లు రావడం ఆనందంగా ఉంది.

- రాజేంద్రప్రసాద్‌, ప్రిన్సిపాల్‌Read more