తుప్పు పట్టి పోతున్నాయ్‌!

ABN , First Publish Date - 2022-09-18T05:15:05+05:30 IST

ఈ ఫొటోలు చూసి.. ఇదేదో స్ర్కాబ్‌ దుకాణం అనుకుంటే పొరబడినట్టే. ఇది సాలూరు ఎస్‌ఈబీ స్టేషన్‌. సారా దాడుల్లో పట్టుబడిన వాహనాలివి.

తుప్పు పట్టి పోతున్నాయ్‌!
ఎస్‌ఈబీ స్టేషన్‌ వద్ద ఉన్న సీజ్‌ చేసిన వాహనాలు

సారా కేసుల్లో భారీగా పట్టుబడుతున్న వాహనాలు
వేలం పాట నిర్వహిస్తున్నా.. కలగని మోక్షం
 భద్రపరిచేందుకు ఇబ్బందులు  
(సాలూరు)

ఈ  ఫొటోలు చూసి.. ఇదేదో స్ర్కాబ్‌ దుకాణం అనుకుంటే పొరబడినట్టే. ఇది సాలూరు ఎస్‌ఈబీ స్టేషన్‌. సారా దాడుల్లో పట్టుబడిన వాహనాలివి.  కేసులు పరిష్కారమవుతున్నా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు మాత్రం మోక్షం లభించడం లేదు. లక్షలు విలువ చేసే వాహనాలు  ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టి పోతున్నాయ్‌. వాస్తవంగా 2020 మే నుంచి ఇప్పటి వరకు సాలూరు ఎస్‌ఈబీ అధికారులు 600 కేసులు నమోదు చేశారు.  475 మందిని అరెస్టు చేశారు. సారా అక్రమ రవాణాలో 194 వాహనాలను సీజ్‌ చేశారు. అయితే ఆయా వాహనాలకు అనేకసార్లు వేలం పాట నిర్వహించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అధికారులు నిర్ణయించిన ధరలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒకవేళ పాటలో వాహనం దక్కించుకున్నా.. పేరు మార్పు, మరమ్మతులకు మరింత డబ్బులు చెల్లించాలి. దీంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా ఎస్‌ఈబీ స్టేషన్‌ స్థలం లేకపోవడంతో సీజ్‌ చేసిన వాహనాలను ఆరుబయట, రోడ్లపైనే ఉంచాల్సి వస్తోంది. దీంతో పూర్తిగా పాడైపోతున్నాయి.
 ఉన్నతాధికారులను కోరుతున్నాం
సారా కేసుల్లో పట్టుబడిన వాహనాల ధరలు తగ్గించి వేలం నిర్వహించేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరుతున్నాం. ఈనెల రెండో తేదీన 32 వాహనాలకు వేలం పాట నిర్ణయించగా 22 వాహనాలను కొనుగోలుదారులు దక్కించుకున్నారు. త్వరలో మరో 35 వాహానాలకు వేలం పాట నిర్వహిస్తాం. వాటికి సంబంధించి తేదీలు ప్రకటిస్తాం.  
- బి.ఈశ్వరరావు, సీఐ, ఎస్‌ఈబీ, సాలూరు  


Updated Date - 2022-09-18T05:15:05+05:30 IST