ఉద్యోగాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2022-09-08T05:36:54+05:30 IST

ఉద్యోగం ఇస్తానని.. డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పిందే తడవుగా అప్పో, సప్పో చేసి లక్షల రూపాయల మొత్తాన్ని అప్పగించి ఆ తరువాత కొన్నాళ్లకు తాము మోసపోయాం మొర్రో అని లబోదిబోమంటూ గుండెలు బాదుకోవడం ఎక్కడికక్కడే చూస్తున్నాం.

ఉద్యోగాల పేరుతో మోసం
ఆందోళన చేస్తున్న బాధితులు


రూ.కోట్లు వసూలు చేసిన వ్యక్తి
బాధితుల ఆందోళన
ఆ వ్యక్తిపై ఇతర చోట్లా ఫిర్యాదులు

ఉద్యోగం ఇస్తానని.. డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పిందే తడవుగా అప్పో, సప్పో చేసి లక్షల రూపాయల మొత్తాన్ని అప్పగించి ఆ తరువాత కొన్నాళ్లకు తాము మోసపోయాం మొర్రో అని లబోదిబోమంటూ గుండెలు బాదుకోవడం ఎక్కడికక్కడే చూస్తున్నాం. జిల్లాలో ఈ తరహా ఘటనలు షరామామూలుగా మారాయి. తాజాగా బొబ్బిలి పట్టణంలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. లక్షలాది రూపాయాలు ముట్టజెప్పిన వారంతా బుధవారం ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బొబ్బిలి, సెప్టెంబరు 7:
ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో కలిసి దిగినట్లు ఫొటోలు తయారు చేయించి కరపత్రాలు విడుదల చేసి ఉద్యోగాలిస్తానని చెప్పాడు. నకిలీ గుర్తింపు కార్డులు, ఒప్పంద పత్రాలు కూడా తయారు చేశాడు. వాటిని చూసి కొందరు నిజమేనని నమ్మి అతని వద్ద ఉద్యోగంలో చేరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-శ్రమ్‌ తదితర పథకాల కోసం గుర్తింపు కార్డులను, ఆధార్‌, ఇతర కార్డులను  జారీ చేయడం ఉద్యోగంలో చేరిన వారి కర్తవ్యంగా నిర్దేశించాడు. ఎగ్జిక్యూటివ్‌గా చేరిన వారి నుంచి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల మేర వసూలు చేసి వారికి  రూ.25,600 జీతంగా నిర్ణయించాడు. పెట్రోల్‌ అలవెన్స్‌ కూడా ప్రకటించాడు. అసిస్టెంట్‌ ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలు వసూలు చేసి వారికి రూ.19,600గా నిర్ణయించాడు. నిరుద్యోగులంతా సంబరపడి డబ్బులు చెల్లించారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించి స్థానిక చినబజారుసెంటరులో మోసం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి బుధవారం బాధితులంతా ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఇంట్లో  లేడు. కొడుకు, కోడలు ఎటు వెళ్లారో తెలియదని తల్లిదండ్రులు చెప్పడంతో బాధితులంతా ఖంగుతిన్నారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బులను వెంటనే వాపసు చేయాలని, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులంతా ఆ ఇంటి ముందు చాలాసేపు నినాదాలు చేశారు. బాధితుల్లో బొబ్బిలి, బలిజిపేట, మక్కువ, పార్వతీపురం తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉండడం గమనార్హం.  బొబ్బిలిలో పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ విజయనగరం, పార్వతీపురంలో ఫిర్యాదులు వెళ్లాయని తెలిసింది.  

రూ.22 లక్షలు చెల్లించాను
నేను నిందితుని అండర్‌లో పనిచేస్తున్నాను. రూ.22 లక్షలు చెల్లించి 17 మందిని జాయిన్‌ చేశాను. ఆర్‌ఎంకు ఈ డబ్బులన్నీ చెల్లించినట్లు చెప్పాడు. ఇప్పుడు పొంతనలేని సమాధానం చెబుతున్నాడు. సంస్థ నిర్వాహకులు బయటకు వచ్చి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి.
                    - అచ్యుత, పార్వతీపురం

రెండు నెలల జీతం ఇచ్చి..

నేను ఫిబ్రవరిలో ఉద్యోగంలో చేరాను. ఇందుకోసం రూ.1.75 లక్షలు చెల్లించాను. రెండు నెలల జీతం ఇచ్చి తరువాత నుంచి ఇవ్వడం లేదు. అయినా ఇంకా చాలామందిని జాయిన్‌ చేసుకుంటున్నారు. మాకే జీతాలు లేవు. ఇంకెందుకు వారిని జాయిన్‌ చేసుకుంటున్నారని ప్రశ్నించాం.
        - గుల్ల పల్లవి, బొబ్బిలి

బంధువుల కోసం లక్షలు చెల్లించాను

మా సొంత కుటుంబీకులు ముగ్గురు కోసం రూ.5.10 లక్షలు చెల్లించాను. నేను కూడా మోసపోయాను. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. పెద్దలు కలుగజేసుకొని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని కోరుతున్నాను.
                - ఈదుబిల్లి జగన్నాథస్వామి, బొబ్బిలి


ఫిర్యాదు రాలేదు
ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించి మోసపోయినట్లు మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటాం.
            - మలిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ, బొబ్బిలి


Read more