భయం.. భయం

ABN , First Publish Date - 2022-09-20T05:29:09+05:30 IST

ఉమ్మడి జిల్లా ప్రజలను జంతువుల భయం పట్టి పీడిస్తోంది. మొన్నటివరకు ఏనుగుల భయమే వెంటాడేది. నెల రోజుల నుంచి పులి సంచరిస్తూ ప్రజలను నిద్ర పోనివ్వడం లేదు.

భయం.. భయం


ఉమ్మడి జిల్లా ప్రజలను వణికిస్తున్న జంతువులు
ఇక్కడ పులులు.. అక్కడ ఏనుగుల సంచారం
అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం


ఉమ్మడి జిల్లా ప్రజలను జంతువుల భయం పట్టి పీడిస్తోంది. మొన్నటివరకు ఏనుగుల భయమే వెంటాడేది. నెల రోజుల నుంచి పులి సంచరిస్తూ ప్రజలను నిద్ర పోనివ్వడం లేదు. ఎస్‌.కోట-కొత్తవలస ప్రాంతాల్లో ప్రారంభమైన పులి అలజడి విజయనగరం జిల్లా దాటి ఉమ్మడి జిల్లాగా కొనసాగిన పార్వతీపురం మన్యం వైపు పాకింది. మన్యం జిల్లా వాసులు ఇంతవరకు ఏనుగుల బెడదతోనే సతమతమయ్యేవారు. శుక్రవారం రాత్రి సాలూరు మండలం మారయపాడు గిరిజన గ్రామంలో రెండు ఆవులను పులి హత మార్చడంతో సాలూరు, మక్కువ ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలవైపు పులి సంచారం పారంభించినట్లయింది.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)  
బొబ్బిలి మండలం మెట్టవలస క్వారీ వద్ద పులి సంచరిస్తుండగా స్వయంగా చూశామని తాజాగా అక్కడి కార్మికులే చెప్పడంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి కూతవేటు దూరంలోకి పులి వచ్చినట్లయింది. కొత్తవలస, ఎస్‌.కోట, మెంటాడ, దత్తిరాజేరు, మెరకముడిదాం మండలం పులుగుమ్మి, తెర్లాం లింగాపురం, బలిజిపేట మండలం వంతరాం, బొండపల్లి మండలాల సమీపాల్లో పులుల సంచారం ఇప్పటికే కొనసాగింది. వివిధ ప్రాంతాల్లో పులి తిరిగినట్లు ఆనవాళ్లు కన్పిస్తున్న కారణంగా అది ఒక పులి కాదని రెండు పులులుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ ఘటనలతో ఏ క్షణంలో ఎక్కడ పులి ఎదురుపడుతుందో అన్న టెన్షన్‌లో ప్రజలు ఉంటున్నారు. అయితే ఇంతవరకు మనుషులకు ప్రాణాపాయం కలగలేదు. కానీ ఆవులు, గొర్రెలపై దాడులు చేస్తూ నష్టాన్ని కలిగిస్తోంది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలూ ఫలించడం లేదు. పగలంతా ఎక్కడ తిరుగుతుందో తెలియదు కాని రాత్రికి రాత్రి 50 కిలోమీటర్లు పైబడి ప్రయాణిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. అటవీ శాఖ అధికారులు మాటు వేసినా ఫలితం ఉండటం లేదు. ఏదైనా పశువును చంపి రెండు మూడు రోజుల పాటు ఆహారంగా తీసుకునే అవకాశం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించి మాటు వేస్తున్నారు. ఇందులో భాగంగా బొండపల్లి మండలంలో ఇటీవల బోను కూడా సిద్ధం చేశారు. కాని అది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో నిరాశే మిగిలింది. గొర్రెలు, ఆవులపై దాడి చేస్తున్న సందర్భాల్లో ఒక్కోసారి పులి మనుషుల కంటపడుతున్నట్లు చెబుతున్నారు. ఇలా ప్రతి క్షణం భయంతోనే గడపాల్సినపరిస్థితి ఏర్పడింది.


దశాబ్దాన్నర కాలంగా
ఉమ్మడి జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరుతో పాటు కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన పాలకొండ నియోజకవర్గాల్లో ఏనుగులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. సీతంపేట, భామిని, పాలకొండ, వీరఘట్టాం మండలాలతో పాటు జియ్యమ్మవలస, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పార్వతీపురం మండలాల్లో ఏనుగులు దశాబ్దాన్నర కాలంగా స్వైరవిహారం చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. అరటి, చెరకు, మొక్కజొన్న, వరిని భారీగా ధ్వంసం చేస్తున్నాయి. పొలానికి వెళితే ఏ క్షణాన ఏనుగులు దాడి చేస్తాయో అన్న భయం గిరిజనులకు పట్టుకుంది. ఆరు ఏనుగుల గుంపు రోజుకో మండలంలో దర్శనమిస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడే సంతానోత్పత్తి కూడా చేస్తున్నాయి. కొమరాడ మండలం దుగ్గి సమీపంలో ఏడాది క్రితం ఏనుగు ప్రసవించింది.


లఖేరి నుంచి ఏనుగుల రాక
ఒడిశాలోని లఖేరీ అభయారణ్యం నుంచి 2008 ప్రాంతంలో నాగావళి నది దాటి ఉమ్మడి జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆంధ్రాలోకి అడుగు పెట్టాయి. ప్రారంభంలో మనుషులపై కూడా దాడి చేసేవి. పార్వతీపురం మన్యం జిల్లాలో 8 మంది వరకు చనిపోయారు. ఇప్పటికీ రైతుల పంటలకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. పాలకొండ డివిజన్‌ ప్రాంత మండలాల్లో కొన్నాళ్లు సంచిరించిన ఏనుగులు ఇప్పుడు కొమరాడ, జియ్యమ్మవలస మండలాలను వీడడం లేదు. దీంతో బిక్కు బిక్కుమంటూ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా ఒక వైపు ఏనుగులు, మరోవైపు పులులు ఉమ్మడి జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

బాడంగిలో పులి దాడి
బాడంగి : పులి వరుస దాడులతో రైతులు ఆవులను రక్షించుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా పాట్లు పడుతున్నారు. గత 15 రోజుల్లో పులి బాడంగి మండలంలో రెండోసారి ఆవులపై పంజా విసిరింది. తాజాగా ఆదివారం రాత్రి రావివలస గ్రామంలో రామిరెడ్డి సుబ్బారెడ్డి అనే రైతుకు చెందిన రెండు ఆవులను చంపేసింది. విషయం తెలుసుకున్న సబ్‌ డీఎఫ్‌వో రాజారావు, డీఆర్‌వో సుజం, ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని ఆరా తీశారు. ఎస్‌ఐ జయంతి, ఎంపీడీవో అక్కారావులు పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రివేళల్లో ఆరుబయట నిద్రపోవద్దని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అన్నారు. పులి రావివలస మీదుగా పులిగుమ్మి కొండకు చేరుకుని ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.


Updated Date - 2022-09-20T05:29:09+05:30 IST