ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూత

ABN , First Publish Date - 2022-02-16T05:38:02+05:30 IST

వాహనం నుంచి రోడ్డుపైకి దూకిన మేకపిల్లను కాపాడే ప్రయత్నంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకూ తమతో కబుర్లు చెబుతున్న చిట్టితల్లి తమ కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి... ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూత
మృతి చెందిన బట్టువీక్షిత(పైల్‌పోటో).

 మేకపిల్లను కాపాడబోయి..

- లారీ కింద పడిన బాలిక

- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కన్నుమూత

భోగాపురం, ఫిబ్రవరి 15: వాహనం నుంచి రోడ్డుపైకి దూకిన మేకపిల్లను కాపాడే ప్రయత్నంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకూ తమతో కబుర్లు చెబుతున్న చిట్టితల్లి తమ కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి... ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఇదీ డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామానికి చెందిన బట్టు వీక్షిత(6) విషాదాంతం. భోగాపురం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ... డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామానికి చెందిన  బట్టు బంగారిరెడ్డి, రామలక్ష్మిల కుమార్తె వీక్షిత. భోగాపురం మండలం గాలిపేటలోని తాతయ్య, అమ్మమ్మలు కొయ్య ఆదినారాయణ, పైడమ్మల వద్దకు సంక్రాంతి పండగకు వచ్చింది. అప్పటి నుంచీ వారి వద్దనే ఉంటోంది. ఈ నెల 14న తాతయ్య, అమ్మమ్మలతో కలసి సవరవల్లి సంతకు వెళ్లింది. అక్కడ మేకపిల్లను కొని..  మధ్యాహ్నం ఆటోలో ఇంటికి బయలుదేరారు. గాలిపేట జంక్షన్‌ వద్ద వారంతా ఆటో దిగారు. ఆ సమయంలో మేకపిల్ల వారి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తింది. వాహనాలు వస్తుండడంతో... ఆ మూగజీవిని ఢీకొంటాయేమోనని చిన్నారి వీక్షిత భయపడింది. వెంటనే మేకపిల్లను పట్టుకోవడానికి పరుగు తీసింది. అదే సమయంలో కంచేరు నుంచి ఎ.రాయవలస వైపు వస్తున్న లారీ వీక్షితను ఢీకొంది. దీంతో పాప కాలు నుజ్జయింది. చిన్నారిని చికిత్స కోసం తగరపువలస ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం వేకువ జామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాపకు ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తవుడు తెలిపారు.

 

 

Updated Date - 2022-02-16T05:38:02+05:30 IST