దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-25T05:20:15+05:30 IST

దసరా వేడుకలకు ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది. ఈ నెల 26 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.

దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
కోటదుర్గమ్మ అమ్మవారి దేవాలయం

ముస్తాబైన పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం

రేపు నిజరూప దర్శనం

 ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పాలకొండ: దసరా వేడుకలకు ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది. ఈ నెల 26 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.  ఉత్తరాంధ్రతో ఒడిశా రాష్ట్రం నుంచి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఇప్పటికే దేవదాయ శాఖాధికారులు ఆలయంలో  ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు తదితర వాటిని ఏర్పాటు చేశారు. శ్రీఘ దర్శనం టిక్కెట్‌ రూ.25గా నిర్ధారించారు.   అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో రాధాకృష్ణ  తెలిపారు. ఉత్సవాలకు ఈ ఏడాది రూ.24 లక్షలు మేర నిధులు మంజూరైనట్టు  చెప్పారు.   ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు 26న కోటదుర్గమ్మ నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక  బలగాలను అందుబాటులో ఉంచనున్నారు.  

కళావేదిక మార్పు

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటా ఆలయం ముందు భాగంలోని కళావేదిక ఏర్పాటు చేసుకుని, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది ఎస్పీ ఆదేశాల మేరకు కళా వేదికను మార్చాలని సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ఆలయ ఆవరణలో ఉన్న కల్యాణ మండపం సమీపంలో కళా వేదికను ఏర్పాటు చేయనున్నారు.  సామూహిక సంబరాలను ప్రధాన మార్కెట్‌ నుంచి ఆలయ ప్రాంగణానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు నిర్వహించే అన్నదాన కార్యక్రమం కల్యాణ మండపంలోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మండపం వెనుక భాగంలో వాహనాల పార్కింగ్‌కు వినియోగించనున్నారు. పాలకొండ, వీరఘట్టం నుంచి వచ్చే వాహనాలను వీరఘట్టం జంక్షన్‌ వద్ద నిలిపివేసి అక్కడే పార్కింగ్‌కు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.

 వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం 

దసరా ఉత్సవాల్లో భాగంగా  26న అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. 27న బాలా త్రిపురసుందరీదేవిగా, 28న  గాయ త్రీదేవిగా, 29న అన్నపూర్ణాదేవిగా, 30 లలితా త్రిపురసుందరీ దేవిగా, అక్టోబర్‌ 1న   మహాలక్ష్మీదేవిగా, 2న  సరస్వతిదేవిగా, 3న  దుర్గాదేవి (దుర్గాష్టమి)గా, 4న మహిషాసురమర్దినీదేవిగా, 5న  రాజరాజేశ్వరిదేవి (విజయదశమి)గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

 ఏటా తప్పని ఇబ్బందులు

ఏటా కోటదుర్గమ్మ ఉత్సవాలకు  భారీగా తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో దేవదాయశాఖాధికారులు విఫలమవుతున్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మూడేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఉత్సవాలపై అధికారులు మరింత దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉంది.  ప్రధానంగా వీఐపీలు, వీవీఐపీల పేరుతో స్థానికులే తరచూ  ఆలయంలోకి వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ దశలో మిగిలిన భక్తులు అసౌకర్యానికి  గురవకుండా అధికారులు చూసుకోవాల్సి ఉంది.  క్యూలైన్లలో ఉండే భక్తులకు తాగునీరు, వైద్యసేవలు అందించాల్సి ఉంది. భద్రతాపరమైన ఏర్పాట్లును పక్కాగా నిర్వహించాలి. ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు.  


  

Updated Date - 2022-09-25T05:20:15+05:30 IST