ఉద్యోగుల విభజన కొలిక్కి...

ABN , First Publish Date - 2022-04-05T06:17:24+05:30 IST

కొత్త జిల్లాల పాలనకు ప్రభుత్వం శ్రీకార చుట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది.

ఉద్యోగుల విభజన కొలిక్కి...

 విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు పోలీసుల కేటాయింపు

 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 4 : కొత్త జిల్లాల పాలనకు ప్రభుత్వం శ్రీకార చుట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చింది. జిల్లా నుంచి అటు పార్వతీపురం మన్యం జిల్లాకు, ఇటు విజయనగరం జిల్లాకు పలువురు పోలీసులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వీరకుమార్‌ను విజయనగరం జిల్లాకు బదిలీ చేసింది. జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు ఒక సీఐ, నలుగురు ఎస్‌ఐలు, ఒక ఏఎస్‌ఐ, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఆరుగురు మినిస్టీరియల్‌ సిబ్బందిని కేటాయించారు. ఇక   విజయనగరం జిల్లాకు నలుగురు ఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు, మినిస్టీరియల్‌ సిబ్బంది ముగ్గురిని కేటాయించారు. ఈమేరకు డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. 

రెవెన్యూ పరిధిలో..  

జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తయింది. జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు  తహసీల్దార్లు - ముగ్గురు, డిప్యూటీ తహసీల్దార్‌ ఒకరు, సీనియర్‌ అసిస్టెంట్‌లు -2,  జూనియర్‌ అసిస్టెంట్‌లు -2, టైపిస్టు -1, ఆఫీసు సబార్డినేట్‌లు -3 పోస్టులు కేటాయించారు.  విజయనగరం జిల్లాకు సీనియర్‌ అసిస్టెంట్‌లు -2, జూనియర్‌ అసిస్టెంట్‌లు -3, టైపిస్టు ఒకరిని కేటాయించారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. 

 హౌసింగ్‌ పీడీ హోదా మార్పు..

గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ల హోదాను.. ‘డిస్ర్టిక్ట్‌ హెడ్‌ హౌసింగ్‌’గా ప్రభుత్వం మార్పు చేసింది.  ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. గృహ నిర్మాణశాఖ పీడీ ఎన్‌.గణపతి.. ఇకపై ‘డిస్ర్టిక్ట్‌ హెడ్‌-హౌసింగ్‌’గా కొనసాగనున్నారు. 

పార్వతీపురం మన్యానికి 22 మంది

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4: జిల్లాలోని రెవెన్యూ శాఖ నుంచి కొత్తగా ఏర్పటైన పార్వతీపురం మన్యం జిల్లాకు 22 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్తులు ఇచ్చింది. నలుగురు తహసీల్దార్లు, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్‌ అసిస్టెంట్లు ,మరో ఐదుగురు ఆఫీసు సబార్డినేట్లను పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయిస్తూ ఆదేశాలు వచ్చాయి. వారంతా సోమవారం ఇక్కడి నుంచి రిలీవై... అక్కడ బాధ్యతలు స్వీకరించారు. 

 

Read more