ఏనుగుల బీభత్సం

ABN , First Publish Date - 2022-10-12T05:27:30+05:30 IST

జిల్లాలోని కొమరాడ, భామిని మండలాల్లో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఏనుగుల బీభత్సం
భామిని: పెద్దదిమిలి పొలాల్లో ఏనుగులు

  కొమరాడ, భామినిలో హల్‌చల్‌ 

  ఒంటరి ఏనుగు దాడిలో మృతి చెందిన ఆవు  

 పంటలు ధ్వంసం 

 కొమరాడ/భామిని: జిల్లాలోని కొమరాడ, భామిని మండలాల్లో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గతవారం రోజులుగా కొమరాడ మండలం వన్నాం పంచాయతీలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా  సోమవారం అర్ధరాత్రి వన్నం గ్రామానికి చెందిన వాన శ్రీనివాసరావుకు చెందిన ఆవుపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. దీంతో ఆవు మృతి చెందింది. అదే గ్రామానికి సమీపంలో ఉన్న ఈదలవలస, చెక్కవలస గ్రామాల్లోకి వెళ్లిన గజరాజులు పాఠశాల ప్రహరీ, ఇంటింటికీ వేసిన కొళాయి పైపులను ధ్వంసం చేశాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. అప్రమత్తంగా ఉండాలని మరోవైపు కురుపాం రేంజర్‌ రాజబాబు ఆయా ప్రాంతవాసులకు సూచించారు. సాయంత్రం 6 గంటల తరువాత పొలాల్లో రైతులు ఉండరాదన్నారు. ఇక భామిని మండలంలోని పెద్దదిమిలి గ్రామ సమీపంలో  బోడికొండ వద్ద ఉన్న జీడి మొక్కలు, పత్తి  పంటను సోమవారం రాత్రి ఏనుగులు ధ్వంసం చేశాయి.  అనంతరం అవి సీతంపేట  మండలం డెప్పిగూడ, కీసరజోడువైపు వెళ్లాయి. అయితే ఈ ఏనుగులు మళ్లీ ఘనసర వైపు వచ్చే అవకాశముందని అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు.  కొన్నాళ్లుగా ఏనుగుల బెడద లేనప్పటికీ రెండు ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు.  ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి గజరాజులను తరలించే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. 

 

Updated Date - 2022-10-12T05:27:30+05:30 IST