చినుకు.. చింత

ABN , First Publish Date - 2022-11-25T00:22:32+05:30 IST

వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు రైతులను కలవర పరుస్తున్నాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో పాటు అక్కడక్కడ చిరు జల్లులు పడడంతో అన్నదాతలు టెన్షన్‌కు గురవుతున్నారు.

చినుకు.. చింత
పూసపాటిరేగ: కుమిలిలో తడిచిన వరి పనలు

మారిన వాతావరణం

అక్కడక్కడ చిరు జల్లులు

వరి పనులను తీసుకెళ్తున్న రైతుల్లో వణుకు

భోగాపురం/ గజపతినగరం/ వంగర, నవంబరు 24: వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు రైతులను కలవర పరుస్తున్నాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో పాటు అక్కడక్కడ చిరు జల్లులు పడడంతో అన్నదాతలు టెన్షన్‌కు గురవుతున్నారు. కోతకు వచ్చి వరి పంటను ఎలా భద్రపర్చు కోవాలోనని ఆందోళన చెందుతున్నారు. గురువారం తెల్లవారు జామున విపరీతంగా పొగమంచు అలుముకోవడంతో పాటు చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. పోలిపల్లి, భోగాపురం గ్రామాల రైతులు చినుకు పడిన వెంటనే అప్రమత్తమయ్యారు. పొలాల్లో ఉంచిన పంటను వేరొకచోటుకు తరలించడం ప్రారంభించారు. కొందరు అక్కడే కుప్పలుగా వేశారు. అనంతరం వాటిపై టార్పాలిన్‌లను కప్పారు. భోగాపురం మండలంలో 1794 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో సుమారు 150 ఎకరాల వరకు కోతలు కోసి పొలాల్లోనే పంటను ఉంచారు. సుమారు 1000 ఎకరాల్లో కోతలు చేపట్టాల్సి ఉంది.

- గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ మండలాల్లో 14,605 హెక్టార్లలో వరి పంట సాగు చేపట్టారు. 4నుంచి 5వేల హెక్టార్లలో కోతలు మొదలు పెట్టారు. అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి వ్యవప్రయాసలు పడుతున్నారు.

- వంగర, బంగారువలస, మగ్గూరు, మరువాడతో పాటు నాగావళి పరివాహక గ్రామాల రైతులు గురువారం చినుక పడినంతనే అప్రమత్తమయ్యారు. కోసిన పంటను దిబ్బలుగా వేయడంతో పాటు మోపులు కట్టి కళ్లాలకు చేర్చడం మొదలుపెట్టారు. కొందరు నాటుబండ్లలో వరిచేను కళ్లాలకు చేర్చారు.

Updated Date - 2022-11-25T00:22:34+05:30 IST