మా బాధ పట్టదా?

ABN , First Publish Date - 2022-11-25T00:14:03+05:30 IST

వారంతా చిరుద్యోగులు... దీర్ఘకాలికంగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటికైనా తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోతారా?..జీతాలు పెరగకపోతాయా! అనే ఆశతో ముందుకు సాగుతున్నారు.

మా బాధ పట్టదా?
కలెక్టరేట్‌ స్పందనలో వినతి అందించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

ఏడు నెలలుగా జీతాలు అందని వైనం

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో దీర్ఘకాలికంగా విధులు

చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు

ఉన్నతాధికారులు స్పందించాలని వినతి

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

వారంతా చిరుద్యోగులు... దీర్ఘకాలికంగా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటికైనా తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోతారా?..జీతాలు పెరగకపోతాయా! అనే ఆశతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం వారికి ఏడు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులతో ఇంకెన్ని నెలలు గడపాలో తెలియక.. కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాక సతమతమవుతున్నారు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు. పార్వతీపురంలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంపై వారు మండిపడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరల ప్రకారం చూసుకుంటే ప్రస్తుత కాలంలో ఒక కుటుంబం నడవాలంటే కనీసం రూ. 25 వేలు ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు అందించకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా 2011 నుంచి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 61 మంది ఔట్‌సోర్సింగ్‌ విధానంపై పనిచేస్తున్నారు. వారిలో వంట మనుషులుగా, వాచ్‌మెన్‌లుగా అనేకమంది గిరిజనులు ఉన్నారు. నెలకు రూ.15 వేల వేతనంతో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ ఏడాది మే నుంచి వారికి జీతాలు చెల్లించడం లేదు. అందించేది తక్కువ వేతనం అయినప్పటికీ .. ప్రతినెలా సక్రమంగా అందించకపోవడంపై చిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు కూడా స్పందించక పోవడంతో ఇటీవల వారు కలెక్టరేట్‌కు వచ్చారు. తమ సమస్యను ‘స్పందన’ కార్యక్రమంలో అధికారులకు విన్నవించారు. వేతనాలు అందించి తమను ఆదుకోవాలని ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌కు వినతిపత్రాన్ని అందించారు. అయితే దీనిపై జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.

ఆర్థిక ఇబ్బందులెన్నో..

చాలీచాలని జీతాలతోనే పనిచేస్తున్నాం. అయితే ఏడు నెలలుగా వేతనాలు లేకపోవడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనిపై అఽధికారులు స్పందించాలి.

- బి.జగ్గారావు, ఏపీ గిరిజన క్లాస్‌-4 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఎలా బతకాలి?

మాకు ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రస్తుతం చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మాకు వేతనాలందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

- హెచ్‌.చంద్రరావు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సంఘం నాయకుడు

సాంకేతిక సమస్యలతోనే..

కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు అందకపోవడం వాస్తవమే. మరో నాలుగు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- సూర్యనారాయణ, జిల్లా గిరిజన విద్యాశాఖ అధికారి

Updated Date - 2022-11-25T00:14:05+05:30 IST