తిరిగివ్వక... కొత్తగా రాక!

ABN , First Publish Date - 2022-10-04T05:09:03+05:30 IST

ప్రజారోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల నిధులను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం వెనక్కి తీసుకుంది. దీనిపై కమిటీలకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఆలస్యంగా తెలుసుకుని విస్తుపోయారు. రెండేళ్లయినా తిరిగి ఇవ్వలేదు.

తిరిగివ్వక... కొత్తగా రాక!
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం


ఆస్పత్రి నిధులను రెండేళ్ల కిందట వెనక్కు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
అభివృద్ధి కమిటీలకు తెలియకుండానే మళ్లింపు
ఇప్పటికీ తిరిగివ్వని రూ1.80 కోట్లు
కొత్త కేటాయింపులూ నిల్లు
నిర్వహణ కష్టమంటున్న సిబ్బంది

ప్రజారోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల నిధులను కేంద్రం విడుదల చేయగా రాష్ట్రం వెనక్కి తీసుకుంది. దీనిపై కమిటీలకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఆలస్యంగా తెలుసుకుని విస్తుపోయారు. రెండేళ్లయినా తిరిగి ఇవ్వలేదు. కొత్తగా కేటాయింపులు కూడా ఉండడం లేదు. దీంతో ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు. నిర్వహణ కష్టమని వైద్యాధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.1.80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అప్పట్లో జమ అయ్యాయి.

రాజాం, అక్టోబరు 3:

ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి, నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులు కేటాయిస్తుంది. పీహెచ్‌సీల స్థాయి బట్టి రూ.1.60 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు మంజూరు చేస్తుంది. సీహెచ్‌సీలకు రూ.5 లక్షల వరకు కేటాయిస్తుంది. వాటితోనే ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలి. అవసరమైతే అభివృద్ధి కమిటీ ఆమోదంతో ఇతరత్రా అవసరాలకు సైతం వినియోగించుకోవచ్చు. కాగా ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోయినా ఏటా వచ్చే అభివృద్ధి కమిటీ నిధులతో ఆస్పత్రులు నడుస్తుండేవి.
కాగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. జిల్లాలో ఆస్పత్రుల నుంచి సుమారు రూ.1.80కోట్ల వరకూ ప్రభుత్వ ఖజానాకు మళ్లినట్టు సమాచారం. అప్పటి నుంచి ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన ప్రశ్నార్థకంగా మిగిలింది. అంతే కాకుండా ప్రతి పీహెచ్‌సీతో పాటు సీహెచ్‌సీలకు అత్యవసర మందుల కొనుగోలుకు, విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి, అత్యవసర పనులు చేపట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఖర్చులకు చేతిచమురు వదులుతోందని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో జిల్లా ఆసుపత్రితో పాటు 48 పీహెచ్‌సీలు, సామాజిక, ఏరియా ఆసుపత్రులున్నాయి. వీటి నిర్వహణకు అత్యవసర నిధులు ఉంటేనే సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఆస్పత్రి స్థాయి బట్టి, ఓపీ నమోదుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేది. వాటితో ఆస్పత్రిలో పారిశుధ్యం నిర్వహణ, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నెలనెలా సమావేశమై సమస్యలపై చర్చించాలి. కమిటీ ఆమోదంతోనే నిధుల వ్యయం ఉండాలి. అయితే అభివృద్ధి కమిటీలకు తెలియకుండానే ఆ ఆర్థిక సంవత్సరంలో విడుదలైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.


నిర్మాణ పనులెపుడు?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల అదనపు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రహరీలతో పాటు కీలక నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన నిర్మాణాలను రద్దు చేసింది. కొత్తగా టెండర్లు పిలుస్తామని ప్రకటించింది. రెండున్నరేళ్లు దాటుతున్నా ఉలుకు పలుకు లేదు. చాలా ఆస్పత్రుల భవనాలు పునాదులు, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి.

చేతి డబ్బులు ఖర్చు తప్పడం లేదు.
ప్రభుత్వ అసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు మజూరు చేయకపోవడంతో చేతు చమురు వదులుతోంది. గతంలో మంజూరైన నిధులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇంతవరకు తిరిగి రాలేదు. కమిటీల వివరాలు అప్‌లోడ్‌ చేయకపోవడం కూడా నిధుల జాప్యానికి కారణమే. ప్రతి అవసరానికీ చేతి డబ్బులు ఖర్చవుతున్నాయి.
            - శ్రీదేవి వైద్యాధికారి, బొద్దాం

కమిటీల వివరాలు అప్‌లోడ్‌ చేయకే..
ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు ఏర్పాటయ్యాక కమిటీ వివరాలకు సంబంధించిన ఫారమ్స్‌ అప్‌లోడ్‌ చేయలేదు. దీంతో కొన్ని పీహెచ్‌సీలకు అభివృద్ధి కమిటీ నిధులు జమ కాలేదు. గతంలో మంజూరు చేసిన నిధులు వెనక్కి తీసుకోవడం నిజమే. సింగిల్‌ అకౌంట్‌లోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి తీసుకుంది. కమిటీల వివరాలు అప్‌లోడ్‌ చేస్తే త్వరలో తిరిగి జమవుతాయి. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు చేపడుతోంది.
        - రమణకుమారి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి, విజయనగరం


Read more