గరిటడైనను చాలు ఖరము పాలు

ABN , First Publish Date - 2022-09-20T05:07:52+05:30 IST

గోవు పాలు కంటే గాడిద పాలకే గిరాకీ ఎక్కువగా ఉంది. ఉబ్బస వ్యాధి ఉన్నవారికి గాడిద పాలు తాగిస్తే వ్యాధి తగ్గుతుందనేది ప్రజల విశ్వాసం. దీంతో వాటికి డిమాండ్‌ పెరిగింది.

గరిటడైనను చాలు ఖరము పాలు
సాలూరులో గాడిద పాలు విక్రయిస్తున్న దృశ్యం

20 మిల్లీలీటర్లు రూ. 200  

తెలంగాణ నుంచి వచ్చి జిల్లాలో వ్యాపారం

 సాలూరు రూరల్‌, సెప్టెంబరు 18: ‘గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడివడైననేమి ఖరము పాలు..’ అనే పద్యం అందరికీ తెలుసే ఉంటుంది. అప్పటి రోజుల బట్టి వేమన అలా చెప్పి ఉంటాడు. ప్రస్తుతం కాలం మారింది. గోవు పాలు కంటే గాడిద పాలకే గిరాకీ ఎక్కువగా ఉంది.  ఉబ్బస వ్యాధి ఉన్నవారికి గాడిద పాలు తాగిస్తే వ్యాధి తగ్గుతుందనేది ప్రజల విశ్వాసం. దీంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు సాలూరు గాడిదలకు ప్రసిద్ధి. ప్రస్తుతం వేళ్ల మీద లెక్కించడానికి సైతం లేవు. కాగా  తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన ఏడు కుటుంబాలు ఇటీవల సాలూరులో  గాడిదలను తిప్పి పాల వ్యాపారం చేశారు.  20 మిల్లీలీటర్ల పాలను రూ. 200 వరకు విక్రయించారు. ఉబ్బసవ్యాధి ఉన్న పిల్లల కోసం వారి తల్లులు వీటిని కొనుగోలు చేశారు. రోజుకు రూ. 3000 పాలను విక్రయిస్తున్నామని మంచిర్యాలకు చెందిన రేణుక తెలిపారు. సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, గజపతినగరం తదితర పట్టణాల్లో పాలను విక్రయించినట్టు మరో మహిళా వ్యాపారి సాయి చెప్పారు. గతంలో ఉచితంగా లభించే గాడిద పాలు ప్రస్తుతం అధిక ధరకు కొనుగోలు చేస్తుండడంపై పట్టణంలో వృద్ధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

అదొక నమ్మకమే.. 

గాడిద పాలు తాగితే ఉబ్బసం (ఆస్మా) తగ్గుతుందనేది ప్రజల నమ్మకమే. శాస్ర్తీయంగా ఎక్కడా నిరూపితం కాలేదు. పిల్లలకు ఈ వ్యాధి ఉంటే వైద్యనిపుణులను సంప్రదించి తగిన చికిత్సలు పొందాలి.  మూఢనమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

- డాక్టర్‌ శివకుమార్‌, ప్రభుత్వ వైద్యాధికారి, సాలూరు Read more