సీఎం మాటలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-11-25T00:10:07+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.

సీఎం మాటలు హాస్యాస్పదం
సాలూరు శివాలయంలో పూజలు నిర్వహిస్తున్న గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్‌రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. గురువారం సాలూరులోని శివాలయంలో జగన్మోహన్‌ రెడ్డికి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం చవకబారు మాటలు మాట్లాడుతున్నారన్నారు. తనకు తాను చాలా గొప్పగా, ఎంతో గొప్ప వ్యక్తినని గొప్పలు చెప్పుకుంటూ తాటాకు చప్పుళ్లు చేస్తున్న జగన్‌ సంగతి ప్రజానీకానికి తెలుసన్నారు. తండ్రి ముఖ్యమంత్రి పీఠంపై ఉండగా ఆయన పదవిని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు మింగిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అని ఆరోపించారు. చెల్లిని తల్లిని ఇంటోనుంచి గెంటేసిన వ్యక్తి జగన్‌ అని అన్నారు. తండ్రి మరణిస్తే పార్ధివదేహాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవికోసం అత్యాశతో నీచంగా ఆలోచించి సంతకాలు చేయించిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. నలుపుతో నిరసన తెలుపుతారేమోనని భయపడి తన సభకు వెళ్తున్న ఆడపిల్లల చున్నీలను బలవంతంగా లాక్కోన్నారన్నారు. జగన్‌ తన పాలనలో కక్షలు, గొడ్డలిపోట్లు,రౌడీయిజం, హత్యలు, ప్రజలకు చూపి స్తున్నారన్నారు. ఇటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు, చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీసేస్తున్న జగన్మోహన్‌రెడ్డి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-11-25T00:10:07+05:30 IST

Read more