ధాన్యం కొనుగోలు చేయండి

ABN , First Publish Date - 2022-11-29T00:17:30+05:30 IST

జిల్లాలో రైతుల నుంచి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, సకాలంలో వారికి డబ్బులు చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి డిమాండ్‌ చేశారు.

    ధాన్యం కొనుగోలు చేయండి
కలెక్టరేట్‌ ఎదుట నినాదాలు చేస్తున్న టీడీపీ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

పార్వతీపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల నుంచి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, సకాలంలో వారికి డబ్బులు చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి డిమాండ్‌ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది సంక్రాంతికి కూడా ధాన ్యం కొనుగోలు చేయలేదని, దీనివల్ల ఎన్నో రైతుల కుటుంబాలు పండగను చేసుకోలేకపోయాయని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఇదిలా ఉండగా జిల్లావాసులను వణికిస్తున్న ఏనుగులు, పులిని తరలించే చర్యలు తీసుకోవాలని కోరారు. గజరాజుల కారణంగా సీతానగరం మండలంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు. కురుపాం నియోజకవర ్గవాసులు కూడా ఏనుగులు, పులి భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు జాయింట్‌ కలెక్టర్‌ ఆనంద్‌కు వినతిపత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి.ఈశ్వరావు, వేణుగోపాలనాయుడు, పరమేష్‌, కౌన్సిలర్‌ సతీష్‌, చంద్ర, కృష్ణ, తిరుపతిరావు, వెంకటనాయుడు, కృష్ణమోహన్‌, దేవిచంద్రమౌళి, మధుసూదన్‌రావు, జి.వెంకటనాయుడు, శేఖర్‌పాత్రుడు, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T00:17:31+05:30 IST