యాంత్రీకరణతో సాగు బాగు

ABN , First Publish Date - 2022-06-08T05:26:52+05:30 IST

రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు.

యాంత్రీకరణతో సాగు  బాగు
మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

  ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

బెలగాం, జూన్‌ 7 : రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో యంత్ర సేవా పథకం జిల్లాస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... వ్యవసాయంలో రైతులకు వ్యయం తగ్గించి ఆదాయం పెంచేందుకు  ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లాకు రూ. 2.83 కోట్లతో 94 ట్రాక్టర్లు, పరికరాలు మంజూరైనట్లు తెలిపారు. జిల్లా 90 శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో వరి కోత యంత్రాలలో అధిక సబ్సిడీ ఇవ్వాలని, మరిన్ని ఎక్కువ యంత్రాలు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ... రైతులు సంప్రదాయ విధానాలను వీడి ఆధునిక పద్ధతుల్లో  వ్యవసాయం చేయాలన్నారు. యంత్రాల కొనుగోలులో రైతు వాటాగా 10 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణ సదుపాయం కల్పిస్తోందని చెప్పారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు , విశ్వాసరాయి కళావతి , జిల్లా సలహా మండలి బోర్డు చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌, వైస్‌ చైర్మన్‌ బాపూజీ, మున్సిపల్‌ చైర్‌పర్మన్‌ బి.గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Read more