BOTSA తీరుపై YSRCPలో కొత్త చర్చ.మంత్రి ఆదేశాల వెనుక మర్మమేమిటి..అసలేం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2022-05-24T17:25:50+05:30 IST

ఇకపై ఏ పనైనా తనకు చెప్పే చేయాలని మంత్రి బొత్స సత్యానారాయణ విజయనగరం అధికారులను ఎందుకు...

BOTSA తీరుపై YSRCPలో కొత్త చర్చ.మంత్రి ఆదేశాల వెనుక మర్మమేమిటి..అసలేం జరుగుతోంది..!?

ఏపీ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు తన నియోజకవర్గంలోని పరిణామాలు నచ్చడం లేదా? పదేపదే కేడర్‌కు ఆయన జాగ్రత్తలు చెప్పడం వెనుక కారణమేంటి? తను నిర్మించుకున్న రాజకీయసామ్రాజ్యానికి చెదలు పడుతున్నాయని ఆయన ఆందోళన చెందుతున్నారా?తమను ఎవరూ వేలెత్తి చూపకూడదని ఆయన ఆరాటపడటం వెనుక కారణమేంటి... అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్ లో తెలుసుకుందాం.. 


విజయనగరం వైసీపీలో కొత్త చర్చ

ఇకపై ఏ పనైనా తనకు చెప్పే చేయాలని మంత్రి బొత్స సత్యానారాయణ విజయనగరం అధికారులను ఎందుకు ఆదేశించారు. ముఖ్యంగా తన పేరు చెప్పి ఫలానా పని చేయమంటే ఆ విషయం తనకు కచ్చితంగా తెలియాలని బొత్స స్పష్టమైన ఆదేశమివడంపై విజయనగరం వైసీపీలో కొత్త చర్చకు తావిస్తోంది. ఇటీవల కాలంలో బొత్స తీరును గమనిస్తున్న పార్టీ కేడర్‌ ఆయన ఎందుకంత ఆగ్రహంతో ఉన్నారా అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆయన ఆగ్రహంలో జాగ్రత్త పడకపోతే దెబ్బతింటామనే సంకేతం కనిపిస్తోందంటున్నారు.  ఈ మధ్యన బొత్స సత్యనారాయణ కుదిరినప్పుడల్లా పార్టీ కేడర్‌కు, సొంతవారికి జాగ్రత్తలు చెపుతున్నారు. ఏదైనా గుప్పెట మూసి ఉన్నంతవరకే మర్యాద అని... ఒకసారి గుప్పెట తెరిస్తే ఇక  అంతే సంగతులని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని పదే పదే చెపుతున్నారుట. 


వైసీపీకి చెందిన ఏ ఇద్దరు కలిసినా బొత్స గురించే చర్చ

పార్టీలోని కొందరు గాడితప్పుతున్నట్టు గ్రహించే ఆయనీ జాగ్రత్తలు చెపుతున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో చీపురుపల్లిలో జరిగిన సమావేశాలకు కొందరు అనధికార వ్యక్తులు రావడం మంత్రికి చిర్రెత్తుకొచ్చిందని చెపుతున్నారు. అసలా వ్యక్తికి అంతటి ప్రాధాన్యం ఎవరిచ్చారనే విషయమై బొత్స అగ్గిమీద గుగ్గిలమయ్యారని చెపుతున్నారు. దీంతో మండలస్థాయికి కార్యక్రమాలకు ఎన్నడూ హాజరుకాని బొత్స ఏకంగా ఈసారి చీపురుపల్లి మండల సమావేశానికి రావడం ఆశ్చర్యపరిచింది.అయితే మంత్రేమీ ఊరికే రాలేదని,ఇకపై ఏ పనైనా.. ఏ మాటైనా తనకు తెలియాలని.. తన పేరు చెప్పి పని చేయమన్నా.. అది తనకు తెలియాలని అధికారులకు, కీలక నాయకులు స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బొత్స అన్ని విషయాలపై  దృష్టి సారించటంపై  ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీకి చెందిన  ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. 


ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తే సహించేది లేదని...

పార్టీకి సంబంధం లేని వ్యక్తులు తమ నియోజవర్గంలో వేలు పెడుతున్నారనే విషయాన్నిమంత్రి బొత్స దృష్టికి కార్యకర్తలు కూడాతీసుకువెళుతున్నారట..! ఈ విషయమై  ఆగ్రహంతో ఉన్న బొత్స తన ఆంతరంగికులకు దిశా నిర్దేశం చేస్తున్నారట..! ఇటీవల పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో  ఒంటెత్తు పోకడలతో  వ్యవహరిస్తే సహించేది లేదని కొందరి వైఖరిని  బొత్స నేరుగానే తప్పుపట్టారుట.  వ్యక్తిగత నిర్ణయాలతో, సొంత కార్యాచరణతో ముందుకెళితే మోసపోయేది మనమేనన్నది గ్రహించాలని చెప్పుకొచ్చారుట. పార్టీలోని కొంత మంది నేతలు బయటివ్యక్తులకు కల్పిస్తున్న ప్రాధాన్యతే మంత్రి బొత్స చిర్రుబుర్రమనటానికి ప్రధానమైన కారణమని జిల్లాలోచెప్పుకుంటున్నారు. 


ఇంత వరకు తమ గురించి ఇతరులెవరూ వేలెత్తి చూపని  విధంగా తాను నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యానికి చెదలు పడుతున్నాయని సత్తిబాబు చిర్రెత్తిపోతున్నారన్నాంటున్నారు. అయితే  తొలుత సర్దిచెపుదామని తీరు మార్చుకోకపోతే అప్పుడే చర్యలకు దిగుదామని బొత్స వేచి చూస్తున్నారని వైసీపీ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. మరి ఆ జాగ్రత్త పడాల్సిన నేతలు తమ తీరు మార్చుకుంటారా లేక అలాగే వ్యవహరించి పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తారో చూడాలి. 

Read more