గిరిశిఖర పాఠశాలల్లో బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2022-10-13T05:20:49+05:30 IST

బయోమెట్రిక్‌ విధానం ద్వారా కొండలపై విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

గిరిశిఖర పాఠశాలల్లో బయోమెట్రిక్‌
గుమడాం లేఅవుట్‌కు కలినడకన వెళ్తున్న కలెక్టర్‌

ఉపాధ్యాయులు సకాలంలో హాజరయ్యేలా చర్యలు

సాలూరు పర్యటనలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ 

సాలూరు,అక్టోబరు 12:  బయోమెట్రిక్‌ విధానం ద్వారా కొండలపై విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయనలో సాలూరులో పర్యటించారు. తొలుత పట్టణంలో డబ్బివీధిలో ఉన్న మున్సిపల్‌ పాఠశాలను సం దర్శించారు. తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో వెలుతురు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చదివితే పిల్లలకు కంటిచూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే బల్బులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు షూ లేకపోవడంనూ హెచ్‌ఎం సరోజినిరెడ్డిని ప్రశ్నించారు. యూనిఫాంపై కలెక్టర్‌ ఆరా తీశారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న బాత్‌రూమ్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన పెదబోరబందలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని పరిశీలించారు. భవనానికి సమీపంలో ఉన్న మురుగునీటిని తక్షణమే తొలగించాలని, పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని ఎంపీడీవో పార్వతిని కలెక్టర్‌ ఆదేశించారు. సాలూరు మండలం కురుకూటి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంపై నిజనిర్ధారణ కమిటీ వేశామని ఆయన తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా  చర్యలు తీసుకుంటామన్నారు.  ఆయన వెంట డీఈవో ఎస్‌.డీ.వీ. రమణ, తహసీల్దార్‌ రామస్వామి, ఏఈ లోకనాఽథం,  గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.రఘురాం తదితరులు ఉన్నారు. 

కలెక్టర్‌కూ తప్పని దారి కష్టాలు 

సాలూరు పర్యటనలో కలెక్టర్‌కు దారి కష్టాలు తప్పలేదు.  పట్టణ పేదలకు చంద్రంపేట సమీపంలో ఉన్న గుమడాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఅవుట్‌కు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది.  ఇక్కడ మౌలిక వసతులు కల్పించకపోగా, కనీసం రోడ్డు పనులు కూడా పూర్తి చేయలేదు.  ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది.  దీంతో కలెక్టర్‌ మక్కువ రోడ్‌లోనే తన వాహనాన్ని విడిచిపెట్టి కాలినడకన లే అవుట్‌కు వెళ్లి సందర్శించడం చర్చనీయాంశమైంది.  ఇళ్ల నిర్మాణం వేగవంతానికి చర్యలు తీసుకోవాలని, లే అవుట్‌లో తాత్కాలికంగా నీటి సరఫరా ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జియోట్యాగింగ్‌, ఈకేవైసీ శత శాతం పూర్తి చేయాలని తెలిపారు.  మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. 


 

Updated Date - 2022-10-13T05:20:49+05:30 IST