‘భూ’చోడు..!

ABN , First Publish Date - 2022-02-20T05:29:13+05:30 IST

చుట్టూ దట్టమైన అడవులు, వాటి మధ్య అక్కడక్కడ గిరిజన ఆవాసాలు. పొదలతో నిండిన భూములను చదును చేస్తే గిరిజనులు ఆనంద పడతారని... సంచరించేందుకు అనువుగా ఉంటుందని సంబరపడతారని ఆయన అనుకున్నాడు. ఆక్రమణలను వారు గుర్తించలేరని భావించాడు.

‘భూ’చోడు..!
కబ్జా చేసిన భూముల్లో రహదారి నిర్మాణం

50 ఎకరాల సర్కారు భూమి హాంఫట్‌

మార్కెట్‌ విలువ రూ.3 కోట్ల పైమాటే

వాగలు... వంకలనూ వదలని కబ్జాదారు

రోడ్లు వేసి ధర పెంచుకునేందుకు ప్లాన్‌

ఆక్రమిత భూమి చుట్టూ కంచె వేసిన వైనం

గిరిజనుల ఆవాసాల చుట్టూ కంచె


 చుట్టూ దట్టమైన అడవులు, వాటి మధ్య అక్కడక్కడ గిరిజన ఆవాసాలు. పొదలతో నిండిన భూములను చదును చేస్తే గిరిజనులు ఆనంద పడతారని... సంచరించేందుకు అనువుగా ఉంటుందని సంబరపడతారని ఆయన అనుకున్నాడు. ఆక్రమణలను వారు గుర్తించలేరని భావించాడు. అందులో భాగంగానే సుమారు 50 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు. తొలుత కారుచౌకగా గిరిజన భూములను కొట్టేసి.. వాటికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఎంచక్కా ఆక్రమించేశాడు. ఆండ్ర పంచాయతీ నిక్కలవలస రెవెన్యూ పరిధిలోని కుంభివలస గ్రామ సమీపంలో ఈ తతంగం జరిగింది.  


మెంటాడ, ఫిబ్రవరి 19:

బయటి నుంచి చూసేవారికి అతనెవరో తన భూమిని చదును చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా తమ ప్రాంతంలో పొదలు పోయి... అంతా సాగుభూమిలా కనిపిస్తుందని అనిపిస్తుంది. పరిసరాలు బాగుపడతాయని భావించేలా చేస్తుంది. బహుశా ఇదే ఆక్రమణలను అడ్డుకునే వారు లేకుండా చేసింది. ఇదీ కుంబివలస గ్రామ సమీపంలో ఓ వ్యక్తి కబ్జా చేసిన దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ భూమి వెనుక కథ. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆ వ్యక్తితో పాటు మరికొంతమంది ఈ ఆక్రమణల వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. దీని విలువసుమారు రూ.మూడు కోట్లు ఉంటుందని అంచనా. ఆక్రమిత భూములకు రహదారి సౌకర్యం కల్పించి.. ధర రెండురెట్లు పెంచుకునేందుకు తాజాగా బోర్లు వేశాడు. సుమారు ఆయిదేళ్ల కిందట ఆ వ్యక్తి నిక్కల వలసలోని సర్వే నెంబరు 96/2లో 14.60 ఎకరాలు, సర్వేనెంబరు 98లో 10.08ఎకరాలు, 99లో 3.41ఎకరాల జిరాయితీ భూమిని నలుగురు కుటుంబసభ్యుల పేరిట కొనుగోలు చేశాడు. మెల్లమెల్లగా చుట్టుపక్కల భూమిపై కన్నేసి ఎవరికీ అనుమానం కలగకుండా దశలవారీగా సుమారు 50ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఇందులో డీపట్టా భూములు ఉన్నాయి. సర్వే నెంబరు 157లో 14 ఎకరాల 13సెంట్లు, సర్వే నెంబరు 158లో 18.11సెంట్లు కలిపి 32.24సెంట్లపై సుమారు రెండు దశాబ్దాల కిందట స్థానిక గిరిజనులకు డి.పట్టాలు అందజేశారు. ఆ తర్వాత వారు ఆ భూములను అమ్మేసుకున్నారు. అనంతరం అవి ఇద్దరు ముగ్గురి చేతులు మారాయి. ఈ భూములతో పాటు దగ్గరలోని సర్వేనెంబరు 104లో ఉన్న 1.72 ఎకరాల విస్తీరం గల వాగును సైతం ఆ వ్యక్తి కబ్జా చేసేశాడు. సర్వేనెంబరు 97లో13.40ఎకరాల బంజరు భూమి, సర్వేనెంబరు 143లో కొంత కొండపోరంబోకు కలిపి 50ఎకరాల ప్రభుత్వ భూమిని హాంఫట్‌ చేశాడు. తాజాగా పంట మార్పిడికి సిద్ధమయ్యాడు. నీలగిరి పంట చేతికి అందడంతో దాని స్థానంలో కొబ్బరి, జీడి, మామిడి వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ ఘరానా ఆక్రమణదారు అంతటితో ఆగకుండా ఆక్రమిత భూమి రేటుపెంచి అమ్మేసేందుకు పావులు కదుపుతున్నాడు. జిరాయితీ.. ఆక్రమిత భూమికి రహదారి సౌకర్యం కల్పించి ఎకరా ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.5లక్షలను రూ.15లక్షలకు అమాంతం పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ లెక్కన కబ్జాభూమి 50ఎకరాలను కనిష్టంగా రూ.8కోట్లకు విక్రయించేందుకు స్కెచ్‌  వేశాడు.

ఈ భూ బాగోతంలో మరో విస్మయం కలిగించే విషయమేమిటంటే జిరాయితీ, ఆక్రమణ భూములు మొత్తం 64ఎకరాల చుట్టూ ఇనుప కంచె వేశాడు. కుంబివలసతోపాటు సమీపంలోని వేపగుడ్డి గ్రామాల మీదుగా ఫెన్సింగ్‌ వేయడం వల్ల ఈ రెండు గ్రామాల భూములు సైతం కబ్జా చేసినట్లయింది. ఈ భాగోతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. దారిలేక నరకయాతన పడుతున్నామని... చదునుచేసిన రోడ్డుతో కష్టాలు తీరబోతున్నాయన్న ధోరణిలో అమాయక గిరిజనులు మిన్నకుంటున్నారు. దీనిని ఆసరాగా  తీసుకుని కబ్జారాయుడు అవకాశమున్నంత మేర మరింత భూమిని సొంతం చేసుకునే వ్యూహానికి తెర లేపినట్టు ప్రచారంలో ఉంది. 

 భూబాగోతంపై తహసీల్దార్‌ డి.రవిని వివరణ కోరాగా నిక్కలవలస రెవెన్యూలో భూ ఆక్రమణపై వస్తున్న ఆరోపణల మేరకు పరిశీలనకు శనివారం వెళ్లానని చెప్పారు. ఆ భూమిలో చదునుచేసే పనులు జరుగుతుండడాన్ని గుర్తించామన్నారు. కుటుంబ సభ్యుల పేరున 32ఎకరాల జిరాయితీ భూమి ఉన్నట్లు ఓ రైతు చెప్పారని, కొంతమేర మాత్రమే ఆక్రమణ జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. సోమవారం రెవెన్యూ బృందంతో పూర్తి స్థాయిలో సర్వే చేపడతామని తెలిపారు. 



Updated Date - 2022-02-20T05:29:13+05:30 IST