రణ నినాదం

ABN , First Publish Date - 2022-09-08T05:34:39+05:30 IST

తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. నిరుద్యోగ రణం పేరిట విజయనగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీ, అనంతరం సభకు అత్యధికంగా శ్రేణులు హాజరయ్యాయి.

రణ నినాదం
విజయనగరంలో ర్యాలీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు

కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు
కోట నుంచి నిరుద్యోగ రణ ర్యాలీ
మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌ నైజం: అశోక్‌

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 7:
తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. నిరుద్యోగ రణం పేరిట విజయనగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీ, అనంతరం సభకు అత్యధికంగా శ్రేణులు హాజరయ్యాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా తెలుగుయువత నాయకులు ముందుకు కదిలారు. స్థానిక కోట జంక్షన్‌ నుంచి మూడులాంతర్లు మీదుగా కన్యకాపరమేశ్వరీ ఆలయం వరకూ కిలోమీటరన్నర మేర ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగించారు. ర్యాలీని టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు ప్రారంభించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టరు కేఏ నాయుడు కూడా ర్యాలీలో నడిచి యువతలో ఉత్సాహం నింపారు.
తొలుత కోట జంక్షన్‌లో వున్న ఎన్టీఆర్‌ విగ్రహానికి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు పూలమాల వేసి నిరుద్యోగుల సమస్యలపై ఎన్టీఆర్‌కి వినతిపత్రం అందజేశారు. జగన్‌ ఎక్కడ.. జాబ్‌ ఎక్కడ? అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ ముగింపు స్థలం కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ జగన్‌కు మాట తప్పడం, మడమ తిప్పడం మూడున్నర ఏళ్ల కాలంలో అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ వట్టిమటలు చెప్పారని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని జగన్‌ చేతిలోంచి బయటకు తీసుకువచ్చి రక్షించే బాధ్యతను యువత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, జగన్‌ చెప్పేదొకటి.. చేసేదీ మరొకటని.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగులకు మొండిచేయి చూపించారన్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు మాట్లాడుతూ, నిరుద్యోగ రణం కార్యక్రమం మూడు జిల్లాల్లో విజయవంతం అయ్యిందన్నారు. ఈ స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్తామన్నారు. మూడున్నర ఏళ్ల కాలంలో నిరుద్యోగులను జగన్‌ నట్టేట ముంచారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా వున్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. గజపతినగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టరు కేఏ నాయుడు మాట్లాడుతూ, లిక్కర్‌ డాన్‌ బొత్స సత్యనారాయణని విద్యాశాఖ మంత్రిని చేయడం హాస్యాస్పదమన్నారు. వోక్స్‌వ్యాగన్‌ జిల్లాకు రాకపోవడానికి ప్రధాన కారణం మంత్రి బొత్స సత్యనారాయణేనన్నారు. జగన్‌ ప్రభుత్వం మూడున్నర ఏళ్ల కాలంలో అరాచకాలు తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌తో పాటు విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, చీపురుపల్లి, రాజాం, ఎస్‌.కోట తదితర ప్రాంతాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.  కార్యక్రమానికి ముందు విజయనగరం పార్టీ కార్యాలయంలో శ్రీరాం చినబాబును విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు, టీడీపీ నాయకులు కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల నాయకులు బొద్దల నర్సింగరావు, వేచలపు శ్రీను, గంటా పోలినాయుడు, పి.రాజేష్‌వర్మ తదితరులు సన్మానించారు. తెలుగుమహిళా విభాగం తరుపున కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సువ్వాడ వనజాక్షి, అనురాధ బేగం, తెలుగుయువత నాయకులు వేమలి చైతన్యబాబు, సురేంద్ర, పాలూరి రాజనాయుడు, సీహెచ్‌ స్వామి, మాతా బుజ్జి, పీతల కోదండరామ్‌ తదితరులు చినబాబును సన్మానించారు.

Updated Date - 2022-09-08T05:34:39+05:30 IST