-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Attendance is limited on the first day-MRGS-AndhraPradesh
-
సమస్యల స్వాగతం
ABN , First Publish Date - 2022-07-06T05:20:29+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం తెరచుకున్న బడులకు విద్యార్థులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు.

పునఃప్రారంభమైన పాఠశాలలు
తొలిరోజు అంతంతమాత్రంగానే హాజరు
అసౌకర్యాల నడుమే తరగతుల నిర్వహణ
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
పార్వతీపురం-ఆంధ్రజ్యోతి, జూలై 5 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం తెరచుకున్న బడులకు విద్యార్థులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. అయితే కొత్త విద్యా సంవత్సరంలోనూ పిల్లలకు పాత సమస్యలే స్వాగతం పలికాయి. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని బడుల్లో విద్యార్థుల హాజరు పలచగా కనిపించింది. ప్రధానంగా పార్వతీపురం మండలంలోని నర్సిపురం జడ్పీ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. పెదబొండపల్లిలో 300 మందికి 200 మంది హాజరయ్యారు. సీతానగరం మండలం ఆర్.వెంకంపేట పాఠశాలలో విద్యార్థులకు చెట్ల కింద తరగతులు నిర్వహించారు. కురుపాంలోని జడ్పీ పాఠశాలలో 528 మందికి 210 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ స్కూల్‌కు విద్యుత్ సరఫరా లేదు. నాడు-నేడు పనులు మధ్యలోనే నిలిచిపోగా, సమస్యల నడుమే తరగతులు నిర్వహించారు. సాలూరు నియోజకవర్గం మక్కువ జడ్పీ పాఠశాలలో 740 మందికి కేవలం 135 మంది మాత్రమే హాజరయ్యారు.
బిక్కుబిక్కుమంటూనే
గరుగుబిల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూనే హాజరయ్యారు. శివ్వాం పంచాయతీ సీమలవానివలస పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అయినా దీనిని నాడు-నేడులో గుర్తించలేదు. కనీస మరమ్మతు పనులు చేపట్టలేదు. దీంతో స్కూల్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం స్లాబుపై నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. వర్షం కురిస్తే ఇక అంతే సంగతి. వర్షపు నీరు తరగతి గదులతో పాటు వరండాల్లో నిల్వ ఉంటుంది. అయితే మంగళవారం యథావిధిగానే పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. అయితే దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
జిల్లాలో అన్ని పాఠశాలలను సందర్శిస్తా. ఎక్కడైనా సమస్యలుంటే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం.
-బ్రహ్మాజీరావు, ఇన్‌చార్జి డీఈవో