అరుణాచలం.. వచ్చాడా?

ABN , First Publish Date - 2022-03-17T05:26:50+05:30 IST

కళ్ల ముందు భారీగా డబ్బు. 30 రోజుల్లో ఖర్చు చేయాలి...ఇదీ అప్పుడెప్పుడో వచ్చిన ‘అరుణాచలం’ సినిమాలోని ప్రధాన అంశం. ప్రభుత్వ నిధులు పది రోజుల్లో రూ.107 కోట్లు ఖర్చయిపోయాయట. ఇది అధికారులు చెప్పినమాటే. ఈ మాట విన్న జనం...‘అరుణాచలం’ వచ్చాడేమోనని ఆరా తీస్తున్నారు.

అరుణాచలం.. వచ్చాడా?

పది రోజుల్లో రూ.107 కోట్లు తేడా

ఈ నెల 5న రూ.315 కోట్లు ఉన్నట్టు లెక్క

14న రూ.208 కోట్లు చూపించిన వైనం

మరోవైపు రోజుకు రూ.25 కోట్లు ఖర్చు చేయాలట 

ఇదీ అధికార యంత్రాంగం తీరు

 

కళ్ల ముందు భారీగా డబ్బు. 30 రోజుల్లో ఖర్చు చేయాలి...ఇదీ అప్పుడెప్పుడో వచ్చిన ‘అరుణాచలం’ సినిమాలోని ప్రధాన అంశం. ప్రభుత్వ నిధులు పది రోజుల్లో రూ.107 కోట్లు ఖర్చయిపోయాయట. ఇది అధికారులు చెప్పినమాటే.  ఈ మాట విన్న జనం...‘అరుణాచలం’ వచ్చాడేమోనని ఆరా తీస్తున్నారు. అక్కడితో అయిపోలేదు.   ‘రోజుకు రూ.25 కోట్లు ఖర్చు చేయాలి. అదీ 15 రోజుల్లో’ అంటూ ఉన్నతాధికారి మరో టార్గెట్‌ ఇచ్చారు...ఇదీ ఉపాధి హామీ నిధుల కథ. 


(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఒకవైపు తాము చెప్పిన లెక్కలకు సంబంధించి పది రోజుల్లో రూ.107 కోట్లను తేడాగా చూపిస్తున్న అధికారులు. మరోవైపు రోజుకు రూ.25కోట్ల వంతున ఖర్చు కావాలని ఆదేశిస్తున్న అధికారులు. మొత్తమ్మీద ఉపాధి హామీ పథకం ఓ ప్రహసనంలా మారిపోయింది. ఏడాదంతా వదిలేసి...చివరి రోజుల్లో హడావుడి చేయడం పరిపాటిగా మారింది. ఉపాధి హామీ నిధులను ఏటా జిల్లా యంత్రాంగం ఖర్చు చేయలేకపోతోంది. చివరి దశలో హడావిడి చేయడం పరిపాటిగా మారింది. ఎంత మంది కలెక్టర్లు మారినా నిధుల ఖర్చు విషయంలో మార్పు ఉండటం లేదు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో నిధులు వెనక్కు మళ్లిపోయే పరిస్థితి   కనిపిస్తోంది. రోజుకు రూ.25 కోట్ల విలువైన పనులు చేయాలని కలెక్టర్‌ ఇటీవల ఆదేశించడం చూస్తుంటే సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో ఇవి కూడా వెనక్కి మళ్లక  తప్పదేమోననే సందేహం తలెత్తుతోంది. 

ఎంత తేడా

అధికారులు నిధుల లెక్కలు చెబుతున్న తీరులోనూ తిరకాసే కనిపిస్తోంది. ఈనెల 5న జిల్లా పరిషత సర్వ సభ్య సమావేశంలో డ్వామా పీడీ మాట్లాడుతూ ఇంకా రూ.315 కోట్ల కన్వర్జెన్సీ నిధులు సిద్ధంగా ఉన్నాయని, వీటిని నెలాఖరు లోగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 25 రోజుల వ్యవధిలో ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేయటం సాధ్యం కాని పని. ఇదిలా ఉండగా కలెక్టర్‌ సూర్యకుమారి కన్వర్జెన్సీ పనులపై ఈనెల 14న వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో డ్వామా పీడీ జి.ఉమాపరమేశ్వరి మాట్లాడుతూ ఇంకా రూ.208 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌(కన్వర్జన్సీ) నిధులున్నట్లు స్పష్టం చేశారు. పది రోజుల వ్యవధిలో రూ.107 కోట్లు తక్కువ చేసి చూపించారు. మరి రూ. 107 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు? నిధులు ఎటువైపు మళ్లించారన్నది అంతపట్టని ప్రశ్నగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. అంతా గారడీ చేస్తున్నారన్న అపవాదును అధికారులు మూటగట్టుకుంటున్నారు. వందల కోట్ల రూపాయలు ఏమవుతున్నదీ ప్రకటించకుండా నిధుల ఖర్చుకు సంబంధించిన గణాంకాలు ఇష్టారాజ్యంగా చెబుతూ వస్తున్నారు. ఏడాదిలో 10నెలల పాటు పెద్దగా పట్టించుకోకుండా చివరి రెండు నెలల్లో ఉపాధి మెటీరియల్‌ నిధుల ఖర్చు కోసం హడావిడి చేస్తున్నారు. ఏటా నిధులు వెనక్కు మళ్లుతున్నాయి. కావాల్సినంత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. కొన్ని వేల సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్లుకు ఖర్చు చేయరు. శ్మశాన వాటికలు నిర్మించరు. సీసీ రోడ్లు వేయరు. గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు పట్టించుకోవడం లేదు. అన్ని కార్యాలయాలకు భవనాల కొరత ఉంది. నిర్మాణాలు జరుగుతున్న వాటికీ బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదు. సిమెంట్‌, స్టీలు అందించడం లేదు. ఉన్న పనులే పడకేస్తుండడంతో కొత్త పనులు చేపట్టే నాథుడు కనిపించడం లేదు. గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు అనేకం మంజూరు చేశారు. కానీ పనులు జరగటం లేదు. బిల్లులు రావేమోనన్న భయం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల మదిలో గూడు కట్టుకుంది. పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గ్రామాలను అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు హామీలు గుప్పించి ఎన్నికైన సర్పంచులు సైతం అభివృద్ధి పనులు చేపట్టేందుకు భయపడుతున్నారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిధులు వెనక్కు మళ్లక తప్పదని ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.Read more